సిటీబ్యూరో, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : శరవేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారింది. 30లక్షలు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలతో రూపురేఖలు మారిపోనున్నాయి. బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో.. ఐటీ పార్కులకు బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించి పనులు మొదలుపెట్టింది. దీంతో పాటుగా మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ప్రాంత అభివృద్ధికి రాజకీయ ప్రయోజనాలను ఆపాదించింది. కంటోన్మెంట్ ఎన్నికల దృష్ట్యా అప్పట్లో ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నోటిఫికేషన్‌కు నెల రోజుల ముందే అట్టహాసంగా పునాది రాళ్లను వేశారు.
ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వైపు దాదాపు రూ. 3 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందిస్తే..ఇప్పటివరకు భూ సేకరణ పూర్తి కాలేదు. 30 లక్షల జనాభా కలిగి, కోర్ సిటీ తరహాలో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా నార్త్ సిటీ డెవలప్ అవుతుంది. కానీ అందుకు అనుగుణంగా మౌలిక వసతులను పొందడంలో వెనుకబడింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేసి.. కార్యరూపంలోకి తీసుకు రాకుండా కాలయాపన చేస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి డబుల్ డెక్కర్ ప్రాజెక్టు వస్తుందని స్థానికుల ఆశలను నీరుగారిపోయేలా చేస్తోంది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు డిజైన్లు తారుమారు చేసింది. ఈ పిల్లర్‌పై రోడ్ కమ్ మెట్రో సాధ్యం కాదని ప్రకటించింది. దీంతో మెట్రోకు ఇబ్బందులు ఉంటాయని, సాంకేతికంగా అసాధ్యమని వెల్లడించింది. మెట్రో మాజీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హయాంలో ఈ ప్రాంతానికి రావాల్సిన డబుల్ డెక్కర్‌కు మార్పులు చేసింది. అదే సమయంలో మెట్రో విస్తరణ పేరిట హడావుడి చేసిన కాంగ్రెస్ సర్కారు డీపీఆర్ రూపకల్పన చేసిన కేంద్రానికి పంపింది. కానీ ఇప్పటికీ డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం రాకపోవడంతో, ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే ఈ ప్రాంతానికి శాపంగా మారనుందని, మెట్రో విస్తరణ లేకపోతే, నార్త్ సిటీ అభివృద్ధి అసాధ్యమని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి అభిప్రాయపడుతుంది.