ఖైరతాబాద్, మే 6: సినిమా పాటలకు కాపీ రైట్స్ ఉంటాయని, ఒక పాట వాడుకోవాలంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్(ఐపీఆర్‌ఎస్)కు రాయల్టీ కట్టాల్సిందేనని ప్రముఖ సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సోమాజిగూడలోని హోటల్ కత్రియలో ఐపీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘లెర్న్ అండ్ ఎర్న్’ పేరుతో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఆ సంస్థ సీఈవో రాకేశ్ నిగమ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా గోపాలకృష్ణ, సినీ గేయ రచయితలు సాహితీ, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజా, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఐపీఆర్‌ఎస్ సంస్థ నిర్మాత, గేయ రచయిత, సంగీత దర్శకుల జీవితానికి భరోసా కల్పిస్తుందన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ సీనిగేయ రచయితలకు ఐపీఆర్‌ఎస్ తోడ్పాటును అందిస్తుందన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ఈ పద్ధతిలో ఆ సినిమాకు సంబంధించి నిర్మాతకు 50 శాతం, సంగీత దర్శకునికి 25 శాతం, గేయ రచయితకు 25 శాతం డబ్బు వస్తుందన్నారు.