చేర్యాల, డిసెంబర్ 12: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి. కల్యాణోత్సవం అనంతరం స్వామి వారి ఉత్సవాలను తొమ్మిది ఆదివారాల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయవర్గాలు స్వామి క్షేత్రంలో పారిశుధ్య నిర్వహణతో పాటు రాజగోపురం, రాతిగీరల మండపం, కోడెల స్తంభం, గదులకు మరమ్మతులు, రంగులు, సున్నం తదితర పనులు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణోత్సవానికి 50వేల మంది భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజు పెద్ద పట్నం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో కీలకమైనవి. భక్తులు భారీగా స్వామి వారి క్షేత్రానికి తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకునేందుకు ఆలయవర్గాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.
వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి భక్తులు దర్శనం చేసుకునేందుకు రాజగోపురం నుంచి హనుమాన్ ఆలయం వరకు క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి వసతి కోసం ప్రత్యేకంగా 60 నల్లాలు ఏర్పాటు చేశారు. కోనేరులో స్నానం ఆచరించే భక్తుల కోసం శుద్ధమైన జలాలు అందించేందుకు శుద్ధి చేసే యంత్రాలను సిద్ధం చేశారు. కాటేజీలకు సైతం మరమ్మతులు చేస్తున్నారు. తోటబావి, కల్యాణ వేదిక తదితర ప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర పనులు ప్రారంభించడంతో పాటు ఎర్రమట్టిని నింపి చదును చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
25వేల కల్యాణ పత్రికలు పంపిణి
సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలతో పాటు కొమురవెల్లి మీదుగా యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలకు బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో కోరారు. పూర్వపు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో 25వేల కల్యాణ పత్రికలను పంపిణీ చేస్తుండడంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలివ చ్చే ప్రాంతాలకు 20వేల కల్యాణోత్సవ వాల్‌పోస్టర్లు పంపించారు. క్షేత్రంలో భక్తుల రక్షణ కోసం ప్రస్తుతం పని చేస్తున్న 30 కెమెరాలు కాకుండా మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. స్వామి వారిని దర్శించుకుని బయటకు వెళ్లే మార్గం నుంచి భక్తులు లోపలికి వచ్చి దర్శనం చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది 9 ఆదివారాలు
ఈ ఏడాది 9 ఆదివారాల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. జనవరి 22వ తేదీన పట్నంవారం (మొదటి ఆదివారం), 23వ తేదీన హైదరాబాద్ భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం,అగ్నిగుండం, 29న లష్కర్ వారం (రెండో ఆదివారం), ఫిబ్రవరి 5న మూడో ఆదివారం, 12న నాలుగో ఆదివారం, 18న మహాశివరాత్రి పెద్దపట్నం, 19న ఐదో ఆదివారం, 26న ఆరో ఆదివారం, మార్చి 12న ఏడో ఆదివారం, 19న తొమ్మిదో ఆదివారం (అగ్నిగుండాలు) నిర్వహించనున్నారు.