ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 12: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. 8 ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే వ్యవసాయం, సాగునీటి పారుదల, వైద్య రంగాల్లో తెలంగాణ సంచలన విజయాలు నమోదు చేసిందన్నారు. కేసీఆర్ కిట్లు, జిల్లాల వారీగా వైద్యశాలల ఏర్పాటుతో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఓయూ జువాలజీ విభాగం, సొసైటీ ఆఫ్ ఆర్త్రోపొడాలజీ సంయుక్తంగా ‘మలేరియా, జూనోటిక్, వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ – పరిశోధనలో సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశాలపై పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికున్ గున్యాకు దోమలే ప్రధాన కారణమని.. వీటి నిర్మూలనకు నూతన ఆవిష్కరణలు రావాలన్నారు. సహా అనేక జబ్బులను దోమలు అతిపెద్ద సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ ఆర్త్రోపొడాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ బీకే త్యాగి, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ ప్రదీప్కుమార్దాస్, మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరీం ఎం. మరిడియా, మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంద్ర వైతిలింగం, నేపాల్ ప్రభుత్వం తరపున డాక్టర్ రోషన్ కుమార్ యాదవ్, సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, ప్రొఫెసర్ జితేంద్రకుమార్నాయక్ పాల్గొన్నారు.