ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 12: ఉన్నత లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల(మహేంద్రహిల్స్)లో రాష్ట్రస్థాయి క్రీడల ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన కొత్తగూడెం (కబడ్డీ), భువనగిరి, మహబూబ్నగర్ (ఖో ఖో), మహేంద్రహిల్స్, ఖమ్మం (వాలీబాల్), నిజామాబాద్, ఆర్మూర్ (టెన్నీకాయిట్), వరంగల్ వెస్ట్, జగద్గీర్గుట్ట, (క్యారమ్స్), సూర్యాపేట, వికారాబాద్ (చెస్), నిజామాబాద్, కామారెడ్డి (టేబుల్ టెన్నీస్), అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్గా నిలిచిన ఖమ్మం (సంధ్య) జట్లను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ జాయింట్ సెక్రటరీ శారద, కబడ్డీ ఏసియన్ గోల్డ్ మెడలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్డీ భానుప్రసాద్, స్పోర్ట్స్ అఫీసర్ రామలక్ష్మణ్, నోడల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎం.శేషు కుమారి, మహేంద్రహిల్స్ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ నిరూప, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరిరామ్, అయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.