మణికొండ, డిసెంబర్ 12 : తెలంగాణ కేసరి మల్లయుద్ధం (కుస్తీ) పోటీలు మణికొండ మున్సిపాలిటీలో మూడు రోజుల పాటు రసవత్తరంగా సాగాయి. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో జియాగూడ దంగల్‌కు చెందిన సాయికుమార్ పహిల్వాన్‌పై హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతానికి అబు బాకర్ బిన్ అబ్దుల్లా విజయం సాధించాడు. ఈ మేరకు తెలంగాణ కేసరి – 2022 విజేతగా అబ్దుల్లాను రాష్ట్ర రెజ్లింగ్ సంఘం ప్రకటించింది. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రంగారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ వి.ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కస్తూరి యాదయ్య ముదిరాజ్, మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్‌ల సమక్షంలో నగదు పురస్కారంతో పాటు వెండి గధను బహూకరించారు.
జిల్లాలో మొదటిసారి ‘తెలంగాణ కేసరి’
మల్లయోధులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ పోటీలను నిర్వహించామని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యాద య్య ముదిరాజ్ తెలిపారు.
కిక్కిరిసిన క్రీడాప్రాంగణం
మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ అల్కాపూర్ సమీపంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ కేసరి పోటీలకు వివిధ జిల్లాల నుంచి మల్లయోధులు హాజరై తలపడ్డారు. ఈ పోటీలను వీక్షించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.