సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వ్యవసాయం, రైతాంగానికి ఒరిగిందేమి లేదని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మల్యాల మురళీధర్ గుప్తా అన్నారు. బుధవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర బడ్జెట్‌పై ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు.. ప్రతి యేటా విద్య కోసం దాదాపు రూ.80వేల కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఇంకా ఎందుకు అందరికీ ఉచిత విద్య అందడం లేదని ప్రశ్నించారు. విద్య కోసం ప్రత్యేకంగా సెస్సు రూ.5లక్షల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నా నేటికీ పాఠశాలల్లో మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారో చెప్పాలన్నారు. దేశంలో ఉన్న 11కోట్ల మంది రైతుల్లో 80శాతం మంది మధ్యతరగతి వారే ఉంటారని, కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం 13.3 కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు కొంటే మిగిలిన 16.7కోట్ల టన్నుల దాన్యం ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం 2కోట్ల మంది రైతులకు న్యాయం జరిగిందని, మిగతా 9కోట్ల మందిని విస్మరించారని తెలిపారు. 2014లో సన్నా చిన్నకారు రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని మెనిఫెస్టోలో పెట్టి విస్మరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజల పార్టీ సెక్రటరీ జనరల్ ఆయనాల కృష్ణారావు, గౌరవ సలహాదారులు వీఎన్ ప్రసాద్ శాస్త్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ తదితరులు పాల్గొన్నారు.