సిటీబ్యూరో/మారేడ్‌పల్లి, మార్చి 25(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ – మేడ్చల్ ఎంఎంటీఎస్ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు ఎవరనే దిశగా పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి రైల్వే పోలీసులు చూపించారు. ఫొటోలను చూసిన బాధితురాలు జంగం మహేశ్ అనే వ్యక్తిని చూసి ఇతడే అని గుర్తించింది.
ఆమె కొంత అనుమానాస్పదంగా చెప్పడంతో పోలీసులు మరికొందరు అనుమానితులను చూపించారు. వారెవరూ కాదనడంతో మహేశ్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం 17 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 4 రైల్వే టీంలు, 13 సైబరాబాద్ టీంలు మహేశ్ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి విషయంలో బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం నల్లగళ్లచొక్కా వేసుకున్న వ్యక్తిగా గుర్తించిన పోలీసులు 150 నుంచి 200 వరకు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేశ్ గంజాయికి బానిసై ఖాళీగా తిరుగుతున్నాడని, ఇతడిపై గతంలో కూడా కేసులున్నాయని పోలీసులు తెలిపారు. సంవత్సరం కిందటే మహేశ్ భార్య అతడిని వదిలేసి వెళ్లిందని, తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేశ్ గంజాయి తాగుతూ చిన్నచిన్న నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల మేర 14 స్టేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరిలో తప్ప మిగతా చోట్ల కెమెరాలే లేవు. ఒకచోట కేవలం బుకింగ్ పాయింట్ వద్ద ఉన్నప్పటికీ అది కూడా పనిచేయడం లేదని రైల్వే పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ల సీసీ కెమెరాలను పరిశీలించినప్పటికీ ఎక్కడా నిందితుడి ఆనవాళ్లు కనిపించలేదు. అల్వాల్, కొంపల్లి, మేడ్చల్ వద్ద స్టేషన్ వెలుపల కొన్ని ప్రైవేట్ సీసీ ఫుటేజ్‌లు తీసుకుని నిందితుడి ఆనవాళ్లను గుర్తించామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు అల్వాల్‌లో ట్రైన్ ఎక్కినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
నాలుగు పోలీస్ బృందాలు గౌడవెల్లిలో నిందితుడి ఇంటి వద్ద నిఘా పెట్టారు. సోమవారం రాత్రి సమయంలో నిందితుడిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. బాధితురాలికి మహేశ్‌ను దూరం నుంచి చూపించి అతడే అని నిర్ధారించిన తర్వాత ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా మత్తులోనే ఉన్నాడని ఒక అధికారి తెలిపారు. ఆ సమయంలో మహేశ్ ఎక్కడికి వెళ్లి వస్తున్నాడు.. ఎందుకు ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేయాలనుకున్నాడనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేశ్ అరెస్ట్ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
మేడ్చల్: ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుడి ఫొటోను బాధితురాలు గుర్తించడంతో రైల్వే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. మహేశ్ తల్లిదండ్రులు యాదగిరి, ప్రమీల మృతి చెందాడు. మహేశ్ ఏం పని చేయకుండా మద్యం, గంజాయికి బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.