Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సోమవారం (జూలై 3) ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి చారిత్రక మైలురాయిని సాధించింది. మహానగరంలో 3 కారిడార్లలో 69 కిలో మీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించి ఉన్నాయి. నవంబరు 29, 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ఇదే అత్యధిక ప్రయాణికుల సంఖ్య. కరోనా కాలం తరువాత మెట్రోలో ప్రయాణికుల రద్దీ రోజుకు రోజుకు విపరీతంగా పెరుగుతున్నది.
ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కకుండా సులభంగా, వేగంగా అందిస్తున్న మెట్రో ప్రయాణ సేవలను నగరవాసులు ఎంతో ఇష్టపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వచ్చి పని చేస్తుండడంతో కారిడార్-1లో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 2.60 లక్షల మంది ప్రయాణించారు. ఇందులో రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచే 32 వేల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. జూలై 3వ తేదీ సోమవారం ఈ రికార్డు నమోదైందని, మెట్రో చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక మైలు రాయి అని ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చిన మెట్రోకు మొదటి నుంచి మంచి ఆదరణ ఉందన్నారు.
ఇది నిజంగా తమకు ముఖ్యమైన సందర్భమని, నగర వాసులు మెట్రో ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడుతున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. 2020 మార్చి చివరి వారం నుంచి కొవిడ్-19 ప్రభావం మెట్రోపై తీవ్ర ప్రభావాన్ని చూపినా, ఆ తర్వాత కోలుకొని మళ్లీ ప్రయాణికుల ఆదరణను చూరగొందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉండటంతో పాటు నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, విశ్వసనీయమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థగా మెట్రో నిలిచిందని కేవీబీ రెడ్డి తెలిపారు. 2017 నవంబరు 29 నుంచి ప్రారంభమైన మెట్రో సేవలు నగర వ్యాప్తంగా 69 కి.మీ మేర 3 కారిడార్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. మెట్రోలో ప్రయాణం చేస్తూ, ఎంతో ఇష్టమైన ప్రయాణ సాధనంగా ఎంచుకున్న ప్రయాణికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
కారిడార్-1లో 2.60లక్షల మంది
మెట్రో మొదటి దశలో భాగంగా మూడు కారిడార్లలో 69 కి.మీ మేర మెట్రో మార్గాన్ని చేపట్టారు. కారిడార్-1లో(మియాపూర్-ఎల్బీనగర్) మార్గంలో 2.60 లక్షల మంది, కారిడార్-2లో (జేబీఎస్-ఎంజీబీఎస్), కారిడార్-3 (నాగోల్- రాయదుర్గం)లో 2.25లక్షల మంది ప్రయాణం చేశారని హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
అత్యధికంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి
మొత్తం మూడు కారిడార్లలో కలిసి 56 మెట్రో స్టేషన్లు ఉండగా, అందులో అత్యధికంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 32వేల మంది ప్రయాణికులు, ఎల్బీనగర్ నుంచి 30వేల మంది, అమీర్పేట మెట్రో స్టేషన్ నుంచి 29వేల మంది, మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి 23 వేల మంది ప్రయాణం చేశారని మెట్రో అధికారులు తెలిపారు. కాగా రోజు వారి మెట్రో ప్రయాణికులు 5.10లక్షలు దాటిన నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.80లక్షలుగా ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ హోం నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండటం, కొత్తగా ఐటీ ఉద్యోగులు పెరుగుతుండటంతో హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నదని తెలిపారు.