సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చడం మరిచి.. అధికారుల కుర్చీలను భర్తీలో చేయడంలో మైలురాళ్లను చేరుకున్నది. హైదరాబాద్ వాసుల రవాణా కష్టాలను తీర్చడానికి, మెట్రో రెండో దశను పరుగులు పెట్టించాల్సిన ప్రభుత్వం… ఆ విషయాలను పక్కనపెట్టి కేవలం ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ అధికారులకు పునరావాసం కల్పిస్తూ హెచ్ఎంఆర్ఎల్ను మార్చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులతో నిండాల్సిన మెట్రో ఇప్పుడు అధికారులతో ఓవర్ లోడ్ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి.
సుదీర్ఘకాలం పాటు ఒకే ఒక్క మేనేజింగ్ డైరెక్టర్ నేతృత్వంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సాగింది. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని మెట్రో మొదటి దశను పూర్తి చేసి, నగరానికి ప్రతీకగా నిలిపారు. కానీ గడిచిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పాలనలో మాత్రం మెట్రో రైలు సంస్థకు ఏకంగా నలుగురు అధికారులను నియమించడం గమనార్హం. ఒకే కార్యాలయంలో నలుగురు ఉన్నతాధికారులు ఉండీ ఏం చేస్తున్నారనే చర్చ ఇప్పుడు మెట్రో వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో పనిచేసిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ అర్బన్ ట్రాన్స్‌పోర్టు అడ్వైజర్‌గా నియమించింది.
ఆ బాధ్యతలను ఎండీఏ సర్ఫరాజ్ అహ్మద్‌కు కట్టబెట్టారు. ఈయన హయాంలోనే మెట్రో విస్తరణ, ఐఆర్ఎఫ్సీ లోన్ ప్రక్రియ అంతా సాగింది. ఈ సమయంలోనే తొలిసారి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్‌ను ఇటీవలే నియమించింది. ఇంత మంది ఉండగా… తాజాగా ప్రభుత్వం మరో అదనపు ఎండీ పోస్టును సృష్టించి మరీ సీఎంకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న అజిత్ రెడ్డిని తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా అదనపు ఎండీగా బాధ్యతలు కట్టబెట్టిన అజిత్ రెడ్డి నియామాకం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అజిత్ రెడ్డి… నమ్మకస్తుడనే గుర్తింపు కూడా ఉంది. దీంతోనే ప్రస్తుతం సీనియర్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్, సుదీర్ఘకాలం పాటు పనిచేసిన తెలంగాణ మెట్రో మ్యాన్‌గా గుర్తింపు ఎన్వీఎస్ రెడ్డి వంటి అనుభవజ్ఞుల నడుమ అజిత్ రెడ్డిని ఎందుకు తెచ్చారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ చర్చలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పనితీరుపై తీవ్ర అసహనమే తాజా నియమాకానికి కారణమనే అనుమానం ఉంది.
ముఖ్యంగా ఐఆర్ఎఫ్సీ లోన్ వ్యవహారంలో ఎండీ సర్ఫరాజ్ అనుసరించిన తీరు, ఫైళ్ల కదలికల్లో ఆలస్యమే లోన్ వివాదానికి కారణమనే చర్చ కూడా ఉంది. రుణాల సేకరణలో ఆయన విఫలమయ్యారనే భావనతోనే సీఎంకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ రెడ్డిని రంగంలోకి దించినట్లుగా తెలిసింది. ఇక కేంద్రం నియమించిన ఎస్బీఐ క్యాప్స్ త్వరలోనే రీసర్వే చేయనున్న నేపథ్యంలో… గతంలో జరిగిన తప్పిదాలే మళ్లీ పునరావృత్తం అవుతాయనే భావనతో అజిత్‌ను తీసుకువచ్చినట్లుగా సమాచారం. ఒక రకంగా ప్రస్తుత ఎండీ, జేఎండీల విధులకు కత్తెరవేసి అజిత్ రెడ్డికి సర్వహక్కులు అప్పజెప్పే వ్యూహాత్మక నియమాకమని చర్చ నడుస్తోంది.
నగరంలో రోజురోజుకు మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. రద్దీ సమయాల్లో మెట్రో బోగీలు కిక్కిరిసిన జనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కోచ్‌ల సంఖ్యను 3-5కు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పాతబస్తీ మెట్రోతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రెండో దశ విస్తరణ పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడంలో, మెట్రో లైన్లను విస్తరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం అధికారుల నియామాకాలపైనే శ్రద్ధ పెట్టడం విడ్డూరంగా ఉంది. ప్రయాణికులతో నిండిపోయిన మెట్రోకు మౌలిక వసతులు, విస్తరణ ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా అధికారుల ఓవర్ లోడ్‌తో నగర ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.