మెట్రో విలీన ప్రక్రియ గందరగోళంగా మారింది. వంద రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నో చిక్కుముడులను పరిష్కరించాల్సి ఉన్నది. దీంతోనే వంద రోజుల గడువును మరో రెండు నెలలకు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. మెట్రో స్వాధీన ప్రక్రియలో ఆర్థిక వనరులే కీలకపాత్రను పోషిస్తున్నాయి. అంచనాలకు మించిన ఆర్థిక భారంతో నగరంలో సర్కారు పెట్టుకున్న మెట్రో విలీన ప్రక్రియ అంతా సులభం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఓవైపు ట్రాన్సాక్షనల్ అడ్వైజరీని నియమించి మెట్రో ఆదాయ వనరులు, ఆస్తుల విలువ, ఇతర ఆర్థిక వనరులను అధ్యయనం చేయిస్తున్న సర్కారు… ఈ ప్రక్రియను అనుకున్నంత వేగంగా పూర్తి చేసే పరిస్థితి లేదని సమాచారం. ముఖ్యంగా వేరే ట్రాన్సాక్షనల్ అడ్వైజరీని వెతికే పనిలో ఉండగా… కొత్త ఏజెన్సీ వచ్చేంత వరకు పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు.
-సిటీబ్యూరో
స్పష్టత రాని ఆదాయ వనరులు
ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థకు టికెట్లు, అడ్వైర్టెజింగ్తోపాటు, రియల్ ఎస్టేట్ వంటి ప్రధానమైన మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నది. ఇందులో టికెట్ ధరలు ఒప్పందం నాటికి వేసిన అంచనాలకు మించలేదు. ఇక రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లోనూ ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత వరకు నిర్వహణ, అప్పుల భారాన్ని భరించగలమనే అంశాలపై స్పష్టత కోసం అధ్యయనం జరగనున్నది. కాగా, ప్రస్తుతం వంద రోజుల లక్ష్యంతో అధ్యయన పూర్తి చేసి, స్వాధీన ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని సర్కారు భావిస్తున్నది. ఇంకా 60 రోజులే మిగిలి ఉన్నాయి. ఆ లోపు పూర్తయ్యే పరిస్థితి లేదని మెట్రో వర్గాల నుంచి తెలిసిన సమాచారం. దీనికోసమే మరో రెండు నెలల పాటు కాలపరిమితిని పొడిగించి టేకోవర్ ప్రక్రియలో కీలకమైన ఆర్థిక పరమైన సవాళ్లను తెలుసుకోనున్నారు.