సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ): నగరంలో మెట్రోకు ఆదరణ పెరుగుతున్న నష్టాల పేరిట ప్రయాణికులకు అరకొర వసతులే అందుతున్నాయి. మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రాగా, నిత్యం 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కానీ మెట్రోకు వచ్చే నష్టాల భారం ఏటా పెరుగుతూనే ఉంది. సరైన మౌలిక వసతులను లేకుండానే మెట్రో ప్రయాణం సాగుతున్న నష్టాల పేరిట జనాల టికెట్ల భారం పెంచుతున్నారని సిటీ జనాలు మండిపడుతున్నారు.
నిత్యం 4.5 లక్షల ప్రయాణికులతో ఏటా 20-25 శాతం ప్రయాణికుల వృద్ధిని హైదరాబాద్ మెట్రో సంస్థ సాధిస్తోంది. దేశంలోని అన్ని మెట్రో రైలు పురోగతిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించిన కేపీఐ (కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్) నివేదికలో వెల్లడించగా, ఇందులో రెవెన్యూ పరంగా ఒకటే 21 శాతం తరుగుదల ఉందని, ఏటా నష్టాల భారం 13 శాతం మేర పెరుగుతున్నట్లు పేర్కొంది. ఇలా రవాణా పరంగా మెట్రోకు ఆదరణ ఉన్నా.. నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తే రద్దీ పెరిగేందుకు అవకాశం ఉంది. కానీ నష్టాలను సాకుగా చూపుతూ టికెట్ల భారాన్ని మెట్రో నిర్వహణ సంస్థ ఎందుకు మోపుతోందనేది ఇప్పుడు చర్చనీయాంశం.
మెట్రో నిర్వహణ సంస్థకు ఏటా నష్టాల్లోనే నడుస్తున్నట్లుగా ఇటీవల ఆ సంస్థ ఆడిట్ నివేదికల్లోనే తేలింది. తాజా నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 13 శాతం నష్టాల భారం పెరిగిందని పేర్కొంది. ఏటా రూ. 625 కోట్ల నష్టం వస్తుందని తాజా నివేదికలోనూ వెల్లడైంది. అయితే నష్టాలను భారాన్ని తగ్గించుకునే అంశాలను పక్కన పెట్టి, కనీసం పెరిగిన రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంలో నిర్వహణ విఫలమైందని, అందుకే మెట్రో తరచూ సాంకేతిక సమస్యలు, నిత్యం ప్రయాణికుల రద్దీకి కారణాలనే అభిప్రాయం ఉంది. కానీ మెట్రో సంస్థ మాత్రం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా నష్టాలను సాకుగా చూపుతూ జనాలకు మెట్రో సేవలను పరిమితంగా అందిస్తోంది.
నిజానికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వెయ్యి మంది ప్రయాణించేందుకు వీలుగా మూడు బోగీలు మాత్రమే ఉన్నాయి. వీటిలోనూ పరిమితికి మించి ప్రయాణికుల సంఖ్య ఉండటంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంగా మెట్రోకు అదనంగా మూడు బోగీలు తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఆర్థిక భారం పేరిట ఉన్న బోగీలతోనే మెట్రో సంస్థ నెట్టుకొస్తున్నది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. కానీ రెవెన్యూ లోటును సాకుగా చూపుతూ జనాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని మెట్రో నిర్వహణ సంస్థ దూరం చేస్తుందనే అభిప్రాయం ఉంది.
ఇక రెవెన్యూ పెంచుకునేలా 17వేల కోట్ల ఇన్వెంటరీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇందులో ఆక్యుపెన్సీ పెంచడంపై ఆ సంస్థ దృష్టి సారించకపోవడంతో కేవలం టికెట్ల రూపంలో వచ్చే రెవెన్యూ ప్రధాన ఆదాయంగా మారుతుంది. కానీ మెట్రో సంస్థ మాత్రం ఉన్న ఇన్వెంటరీని తగ్గించుకుంటూ, రెవెన్యూ అవకాశాలను దృష్టి పెట్టకపోవడం కూడా వ్యూహాత్మకమేనని విమర్శలు ఉన్నాయి. కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టికెట్ల ధరలను అందుబాటులో ఉంచితే, మరింతగా ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం టికెట్ల ధరలను పెంచుకునేందుకు వీలు కల్పించినట్లు మెట్రో నిర్వహణ సంస్థకు ఆమోదం తెలపడంతో ప్రయాణికులకు అదనపు భారమే అవుతున్నది.