Hyderabad Metro | సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ) : పేరుకే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. కానీ నిర్వహణ లోపంతో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు మెట్రో ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆఫీసులకు, ఇండ్లకు చేరుకునేందుకు, ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడాలని మెట్రోలో ప్రయాణిస్తే ఎప్పుడు ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటున్నాయి. దేశంలోనే సమర్థవంతమైన మెట్రో వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ మెట్రోకు ఇప్పుడు తలంపులు తప్పడం లేదు.
ఎల్ అండ్ టీ నిర్వహణ లోపమో, లేక అధికారుల పర్యవేక్షణ వైఫ్యలమో తెలియదు కానీ ప్రయాణికులను మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. గురువారం అమీర్‌పేట- మియాపూర్ మార్గంలో మొరాయించిన మెట్రోతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మెట్రో రాకపోకలు నిలిచిపోగా, ఆ మార్గంలో మిగతా సర్వీస్‌లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో రద్దీ సమయంలో మెట్రోలో తలెత్తిన సాంకేతిక సమస్యతో భరత్‌నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో బోగీల్లో ఉండి అరగంటకుపైగా ప్రయాణికులు ఎదురు చూశారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెబుతున్నా..మెట్రోకు నిత్యం ఎదురయ్యే టెక్నికల్ సమస్యలతో హెచ్ఎంఆర్ఎల్ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏడాది కాలంగా నగరంలో అనేకసార్లు మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది మార్చి 27న నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తున్న మెట్రో సర్వీసు జూబ్లీహిల్స్ చెక్ వద్ద నిలిచిపోగా, దాదాపు 15 నిమిషాల పాటు సేవలు ఆగిపోయాయి.
జూన్ నెలలో మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచగా వచ్చిన టెక్నికల్ సమశ్యాలతో ఆగిపోతే ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ల నుంచి బయట పడ్డారు. నవంబర్ 11న తలెత్తిన టెక్నికల్ సమస్యలతో ఏకంగా అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డిసెంబర్ నెల్లలోనూ లక్డీకాపూల్, మలక్‌పేట వద్ద టెక్నికల్ సమస్యల కారణంగా అగగా, గతేడాది డిసెంబర్లో తలెత్తిన సమస్యలతో ఏకంగా రెండున్నర గంటలపాటు మెట్రో సేవలు నిలిచాయి. ఏడాది ఏప్రిల్ 3న కూడా ఎల్బీ నగర్ మియాపూర్ మార్గంలో నాంపల్లి దగ్గర ఒక్కసారిగా మెట్రో ఆగిపోయింది.