సిటీబ్యూరో, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ) ః ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో హైదరాబాద్ మెట్రో సంస్థ కేంద్రంతో మరో దఫా చర్చలకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ ప్రాజెక్టును పొడిగించి రెండో దశ విస్తరణలో అనుమతులు కోరింది. పాత 5.5 కిలోమీటర్ల మేర ఉండే మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి 7.5కిలోమీటర్లతో రెండో దశలో ప్రత్యేక కారిడార్‌గా రూ. 2500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తామనీ, దీనికి అనుమతులతోపాటు, నిధులు కేటాయించాలనీ కోరుతూ ఏడు నెలల కిందటే డీపీఆర్ అందజేసింది.
కానీ అనుమతులు రాకుండానే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు మొదలు పెట్టింది. ఇప్పటికీ అటు అనుమతులు రాలేదు. ఇటు భూసేకరణ పూర్తి కాకపోవడంతో… రెండో దశ పేరిట కాంగ్రెస్ చేస్తున్న ప్రతిపాదనల్లోనే ఇదొక విఫల ప్రాజెక్టుగా మారింది. దీంతో మిగిలిన మార్గాలను వదలిపెట్టి, కనీసం ఈ 7.5కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గానికైనా.. పాత ప్రాజెక్టుగా పరిగణించి అనుమతులు కోరేందుకు హైదరాబాద్ మెట్రో సంస్థ కేంద్రం వద్దకు వెళ్లనుంది.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రెండు కిలోమీటర్లు పొడిగించి, ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టును రెండో దశలో రాష్ట్ర సర్కారు ప్రకటించింది. గతంలో ఉన్న ప్రాజెక్టును పొడిగించడం ద్వారా ఓల్డ్ సిటీకి మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే శంకుస్థాపన చేసింది. దీనికోసం 800కు పైగా ఆస్తులను సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులే ఇవ్వలేదు. గతంలో తొలి దశలో ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థనే చేపట్టాల్సి ఉండగా… నిర్వహణ గిట్టుబాటు కాదనీ పనులను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మార్గమే అత్తెసరు ప్రయాణికులతో సాగుతుండగా… చాంద్రాయణగుట్ట వరకు పొడిగించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. విస్తరణ అంశంలో మెట్రో సంస్థ కేవలం ఈ ఒక్క కారిడార్ వరకైనా అనుమతులు తీసుకోవాలని, దీనికి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆలోచనలు ఉన్నాయి.
అనుమతులిస్తేనే ప్రాజెక్టులో పురోగతి
7.5కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గానికి కేంద్రం ఇప్పటికైతే అనుమతులు మంజూరు చేయలేదు. అనుమతుల సౌలభ్యం కోసమే రెండో దశలో ఉన్న ఓల్డ్ సిటీ కారిడార్‌ను ప్రత్యేకంగా పేర్కొన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం మిగిలిన అన్ని మార్గాలకు అనుమతులపై జాప్యం చేసినా… కనీసం ఓల్డ్ సిటీ మెట్రోను పెండింగ్ ప్రాజెక్టుగా చూపించే అవకాశం ఉంటుందనీ భావించింది. కానీ కేంద్రం ఎల్ అండ్ టీతో ఉన్న ఒప్పందంపై స్పష్టత కోరడంతో ఓల్డ్ సిటీ మెట్రోతోపాటు, మిగిలిన అన్ని కారిడార్లలో సందిగ్ధంలో పడిపోయాయి. దీంతో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు వచ్చే ఓల్డ్ సిటీ కారిడార్‌కు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవడంపై అధికారులు దృష్టి పెట్టారు. అనుమతులిస్తే గానీ ప్రాజెక్టు మొత్తానికి పురోగతి ఉండదనీ తెలుస్తోంది..