హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభమైన నేటికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమీర్పేట మెట్రో స్టేషన్లో మెట్రో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 2017, నవంబర్ 29న మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మెట్రో రైలు ప్రారంభించిన తొలి రోజే 2 లక్షల మంది ప్రయాణించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మెట్రోలో ప్రతి రోజు 4.40 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదేండ్లలో మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. త్వరలోనే మెట్రో రెండో దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. రాయదుర్గం – ఎయిర్పోర్టు పనులకు డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్.