Medipally Murder | మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పథకం ప్రకారమే అత్యంత కిరాతకంగా హత్య చేశాడని డీసీపీ పద్మజ వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా కోసి మూసీలో పడేశాడని తెలిపారు. మొత్తం బాడీని మాయం చేయాలని అనుకున్నప్పటికీ.. అంతలోనే భయపడటంతో పోలీసులకు దొరికిపోయాడని వివరించారు.
మేడిపల్లి హత్య కేసు వివరాలను డీసీపీ పద్మజ వివరించారు. మహేందర్ రెడ్డి, స్వాతి ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారని తెలిపారు. పెళ్లయినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు ఉండేవని పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవాళ్లని.. ఈ నెల 22న కూడా ఇలాగే గొడవపడ్డారని చెప్పారు. ‘ గతంలో స్వాతికి అబార్షన్ చేయించాడని ఆమె తెలిపారు. ఇప్పుడు మళ్లీ గర్భవతి కావడంతో మెడికల్ చెకప్‌లకు తీసుకెళ్లమని స్వాతి అడిగింది. ఈ క్రమంలోనే మొదలైన గొడవ పెద్దగా మారడంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఉన్న భార్యను గొంతు నులిమి చంపాడు. ‘ అని డీసీపీ తెలిపారు.
పథకం ప్రకారమే భార్య స్వాతిని మహేందర్ రెడ్డి హత్య చేశాడని డీసీపీ పద్మజా రెడ్డి తెలిపారు. స్వాతి మృతదేహాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేశాడని పేర్కొన్నారు. బాడీని ఒక్కసారిగా తరలించడం వీలుకాక ముక్కలుగా చేశాడని తెలిపారు. ముందుగానే బోడుప్పల్లో కొన్న హాక్సా బ్లేడ్‌తో మృతదేహాన్ని ముక్కలుగా కోశాడని చెప్పారు. తల, కాళ్లు, చేతులు కవర్లలో పెట్టి విడతల వారీగా బయటపడేశాడని తెలిపారు. మొత్తం బాడీ మాయం చేయాలని మహేందర్ రెడ్డి ప్లాన్ చేశాడు.. కానీ అంతలోనే భయపడ్డాడని చెప్పారు. మూడుసార్లు మూసీకి వెళ్లి వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డి తన చెల్లికి కాల్ చేశాడని.. తన భార్య కనిపించడం లేదని ఆమెకు చెప్పాడని అన్నారు.
మహేందర్ రెడ్డి ఫోన్ చేసిన వెంటనే అతడి బావ ఇంటికి వచ్చాడని చెప్పారు. మహేందర్ రెడ్డి బావకు అనుమానం వచ్చిందని తెలిపారు. అతని సూచన మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చి, ఏం తెలియనట్టు నటిద్దామని మహేందర్ రెడ్డి ట్రై చేశాడని పేర్కొన్నారు. కానీ మా ఇన్స్పెక్టర్ ఏదో జరిగి ఉంటుందని అనుమానించాడని తెలిపారు. అందుకే మహేందర్ రెడ్డిని వెంటపెట్టుకుని ఇంటికి వెళ్లాడని చెప్పారు. ఇంట్లో తల, కాళ్లు, చేతులు లేని మృతదేహం గుర్తించామని తెలిపారు. మొండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మిగిలిన శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్నామని తెలిపారు. కీలక ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని పేర్కొన్నారు.