మొయినాబాద్, మార్చి23: విద్యాలయాన్ని వదిలి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత జీవితంలో ఉండిపోవడంతో విద్యార్థి దశనాటి మధుర జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని రోజంతా సంతోషంగా గడిపారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో గల విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం మొయినాబాద్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి రెవెన్యూలో గల ఏ వ్యవసాయ క్షేత్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. పాఠశాలను వదిలి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందరు ఒకే వేదిక మీద కలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యా బుద్దులు చెప్పిన గురువులను సైతం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించి వారికి పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. గురువుల యోగ క్షేమాలు తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు ఒకరిని ఒకరు తమ కుటుంబ పరిస్థితులు, వారి యోగ క్షేమాలను ఒకరికి ఒకరు చెప్పుకున్నారు.
అనంతరం పాఠశాల చైర్మన్ దేవానంద్గౌడ్, ప్రిన్సిపల్ మాధవరెడ్డి, ఇతర ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భరత్‌రెడ్డి, జగదీష్ముదిరాజ్, చేతన్‌శర్మ, కృష్ణమూర్తి, వినయ్‌కుమార్, శ్రీలతరెడ్డి,అర్చనరెడ్డి, మల్లిఖార్జునరావు, అక్షితఅగర్వాల్, దీప్తి, దివ్యవాణిరెడ్డి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.