సిటీబ్యూరో/ఖైరతాబాద్ : ఖైరతాబాద్‌లో 70 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి గురువారం నేత్రాలంకరణ చేయనున్నారు. శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ నేతృత్వంలో సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజుల్లో 70 అడుగుల విగ్రహాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు.
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్వామి వారికి శిల్పి రాజేంద్రన్ నేత్రాలంకరణ చేస్తారు. విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను పూర్తిగా తొలగించి.. సాయంత్రం 4గంటల నుంచే స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు.
మట్టి గణపతుల పంపిణీ షురూ
హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు. గ్రేటర్లో 36 ప్రాంతాల్లో 1లక్ష విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
కేబీఆర్ ప్రాంగణంలో మల్టీ పార్కింగ్
కేబీఆర్ పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. కేబీఆర్ పార్కు వద్ద పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పీపీపీ విధానంలో ఈ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 2 న చేసిన తీర్మానం మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి సంబంధిత పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు.
-జూబ్లీహిల్స్