సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): స్థానికతను ప్రతిబింబించే చిత్రాలు.. మనసును హత్తుకునే చిత్తరువులతో గ్రేటర్లోని జంక్షన్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎస్ఆర్డీపీ ద్వారా ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం చూపుతున్న అధికారులు కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 21.83 కోట్లతో 22 చోట్ల పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రూ. 19.88 కోట్లు ఖర్చు చేసి 20 జంక్షన్లను సరికొత్త అందాలతో తీర్చిదిద్దింది. మరో రెండుచోట్ల రూ.1.95 కోట్లతో పనులు కొనసాగిస్తున్నది. ఈ పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు వివరిస్తున్నారు.