Hyderabad | హెల్త్‌కేర్ రంగంలో ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నది. గ్లోబల్ కంపెనీలు నగరానికి తరలివస్తుండగా, వచ్చిన సంస్థలు విస్తరణ దిశగా అడుగులేస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ , మెట్‌లైఫ్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు న్యూయార్క్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ తర్వాత రెండు సంస్థలు వెల్లడించాయి.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్చ్సేంజ్ (జీహెచ్ఎక్స్)ను హైదరాబాద్‌లో మరింత విస్తరిస్తామని సంస్థ ప్రకటించింది. నగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హెల్త్ కేర్ రంగానికి అద్భుతమైన అనుకూల వాతావరణం ఉన్నదని, అనేక సంస్థల సమ్మిళిత ఎకో సిస్టం ఉన్నదని తెలిపింది. గురువారం న్యూ యార్క్‌లో సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశానంతరం విస్తరణ ప్రణాళికలను ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ వెల్లడించారు. హెల్త్ కేర్ కంపెనీలు పెద్ద ఎత్తున డిజిటలీకరణ చెందుతున్నాయని, ఐటీ ఆధారిత సేవలపై విస్తృత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఈ దిశగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా లక్ష్యాలను చేరుకుంటామని వెల్లడించారు. 2025 నాటికి మూడింతలు పెంచేలా ప్రణాళికలు, ఇంజనీరింగ్, ఆపరేషన్‌ను విస్తరిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అద్భుతమైన మానవ వనరులు, హెల్త్‌కేర్, ఐటీ రంగాలకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్నదని, అందుకే అనేక ప్రపంచ సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగానికి చేయూతను అందిస్తూనే ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్దఎత్తున ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని వెల్లడించారు. జీహెచ్ఎక్స్ తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఆర్థిక సేవలు, బీమారంగ దిగ్గజ సంస్థ మెట్‌లైఫ్ హైదరాబాద్‌లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గురువారం న్యూయార్లో మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయంలో సంస్థ సీనియర్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సంస్థ జీపీసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్, ఫైనా న్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేలా మెట్‌లైఫ్ నిర్ణయం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమారంగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, మెట్లైఫ్ను హైదరాబాద్‌కు స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘న్యూయార్లో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేసిన కాలంలో మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయ భవన రాజసం, నిర్మాణశైలి న న్ను ఆశ్చర్యానికి గురిచేసేది. ఇదే కార్యాలయంలో ఈ రోజున సొంత రాష్ట్రానికి పెట్టుబడులను కోరుతూ సమావేశం కావడం అత్యం త సంతోషాన్ని కలిగిస్తున్నది’ అని మెట్‌లైఫ్ ప్రతినిధులతో కేటీఆర్ వ్యాఖ్యానించారు.