సిటీబ్యూరో/చార్మినార్/మెహదీపట్నం/బేగంపేట, జూన్ 21(నమస్తే తెలంగాణ): 26 నుంచి బోనాల సందడికి భాగ్యనగరం ముస్తాబవుతున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సప్తమాతృకలు సప్తబంగారు బోనాలకు ఏడు దేవాలయాల్లో బంగారు బోనం సమర్పిస్తామని ఉమ్మడి ఆలయాల కమిటీ తెలిపింది. మహానగరంలో వాడవాడలా బోనాల సందడి నెలకొననున్నది. మొత్తం 300కు పైగా దేవాలయాల్లో బోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ప్రధానంగా 29 ఆలయాల్లో ఉత్సవ శోభ నెలకొన్నది.
అయితే గత సంవత్సరం బోనాల జాతర సమయంలో జరిగిన అపశృతులు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులు, మంత్రులు సూచించినప్పటికీ పలు శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో పలువురు అధికారులు అసలు పట్టింపు లేకుండా ఉంటున్నారని, గత సంవత్సరం జరిగిన లోపాలపై సమీక్షల్లో ఎన్నిసార్లు చెప్పినా పనులు చేస్తామని చెప్పి ఆచరణలో నామమాత్రంగా చేస్తున్నారంటూ దేవాలయాల కమిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
శాఖల మధ్య సమన్వయ లోపం..
రాష్ట్ర పండుగ బోనాల జాతర నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ విషయాన్ని బోనాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ స్వయంగా పలు శాఖల ఉన్నతాధికారులతో అన్నారు. బోనాల జాతరకు ఏర్పాట్లు చేయాల్సిన జీహెచ్ఎంసీ, విద్యుత్, డీఎంహెచ్‌వో సిబ్బంది సకాలంలో రావడం లేదని, అంతేకాకుండా వారు నిర్వర్తించాల్సిన విధులు సక్రమంగా చేయడం లేదంటూ తమ శాఖా మంత్రికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.
పురోగతి లేదు..
గోల్కొండ వద్ద బోనాల నిర్వహణకు సంబంధించి కోటపైకి ఎక్కే ర్యాంపులకు మరమ్మతులు చేపట్టడంపై పనుల్లో పురోగతి లేదు. ఇక గత సంవత్సరం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినప్పుడు మంత్రులే ఇబ్బంది పడ్డారు. అప్పుడు రూట్ మ్యాప్ లేకపోవడంతో ఇబ్బందులయ్యాయి. ఈసారి కూడా రూట్‌మ్యాప్ విషయంలో ఏం చేస్తున్నారనేది ఉత్సవ కమిటీలకు సమాచారం ఇవ్వకుండానే పనులు చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి.
బోనాలు జరిగే ముఖ్య ఆలయాల్లో మహిళలు బోనాలు సమర్పించుకోవడానికి బ్యారికేడింగ్ సరిగా చేయకపోవడంవల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల విషయంలోనూ భక్తులకు కావాల్సినట్లుగా ఏర్పాట్లు చేస్తామని ప్రతీ సమావేశంలో చెప్పినా ఇంతవరకూ పనులే పూర్తి కాలేదు. వీఐసీ పాసుల గోల చాలా పెద్దదిగా ప్రతీసారి ఉంటుందని ఈసారి పాసులు తగ్గిస్తామని దేవాదాయశాఖ, పోలీసులు చెబుతున్నా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడులు మళ్లీ యథాస్థితిలోనే పాసులు జారీ అయ్యే పరిస్థితి ఉన్నదని దేవాదాయ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
సప్త మాతృకల సప్త బంగారు బోనాలు..
ఈసారి సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 26న గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. ఈ బోనాన్ని జోగిని నిషాక్రాంతి ఎత్తుకుంటారు. జూన్ 29న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి జోగిని శ్యామల బంగారు బోనం సమర్పిస్తారు. విజయవాడలో జూలై 2 బల్కంపేట ఎల్లమ్మ, జూలై 4న జూబ్ల్లీహిల్స్ పెద్దమ్మతల్లికి, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, జూలై 15న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, జూలై 17న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బంగారు బోనాలు సమర్పిస్తామని ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. వచ్చేనెల 11న ధ్వజారోహణ, కలశస్థాపన, శిఖరపూజ, బోనాలు జరుగుతాయి.
13వ తేదీ ఆదివారం ఘటాల ఊరేగింపు , శాలిబండ విశ్వనాథ్ ఆలయం నుంచి 29 దేవాలయాలకు సంబంధించిన ఘటాల ఊరేగింపు మొదలై ఆయా దేవాలయాల వరకు వెళ్లి అక్కడ ఘటస్థాపన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దేవాలయాల్లో వారివారి సంప్రదాయం ప్రకారం కుంకుమార్చనలు, హోమాలు, లక్ష పుష్పార్చనలు, అభిషేకాలు జరుగుతాయి. 20న బోనాల పండుగ, 21న రంగం, లక్షలాది మందితో ఊరేగింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఘటం అంబారీపై తీసుకొచ్చి నయాపూల్‌లో ఉన్న ఢిల్లీ దర్వాజ ఆలయం వద్దకు చేరడంతో జాతర ముగుస్తుంది.
ఈ నెల 29న హరిబౌలిలోని అక్కన్నమాదన్న ఆలయం నుంచి భాజాభజంత్రీలతో కళాబృందాలు, పోతరాజుల నృత్యప్రదర్శనలు నిర్వహించి విజయవాడకు బయలుదేరనున్నట్లు అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. ముందుగా అక్కన్నమాదన్న దేవాలయంలో అమ్మవారి వద్ద బంగారు పాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయవాడ బయలుదేరుతారు. విజయవాడ బ్రాహ్మణవీధి నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు కళాబృందాల నృత్యప్రదర్శనలతో సామూహిక తెలంగాణ బోనాల జాతర ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ యేడు కూడా కృష్ణానదిలో గంగతెప్పకు పూజల అనంతరం బంగారు బోనంతో పాటు పట్టువస్ర్తాలు, నైవేద్యం సమర్పించనున్నామని ఆయన పేర్కొన్నారు.
బోనాల జాతర షెడ్యూల్
26న గోల్కొండ బోనాలతో ప్రారంభం, జూలై 13న రోజున సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు, అదేరోజు పాతబస్తీలో అమ్మవారి ఘటస్థాపన, ఊరేగింపు, 29 దేవాలయాల ఘటాలు శాలిబండలోని విశ్వనాథాలయం నుంచి ఆయా దేవాలయాల వద్దకు ఊరేగింపు, 20నలాల్దర్వాజ మోడ్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదికపపై నుంచి అధికార, అనధికార ప్రముఖులు పాల్గొని అమ్మవారి ఘటాలకు స్వాగతం పలకనున్నారు. 20న బోనాల పండుగ..పాతబస్తీతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో బోనాలు,21న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు, రంగం కార్యక్రమం ఉంటుంది.