హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్ ధరలు పెరిగాయి. ఒక కప్పు చాయ్ మీద రూ. 5 పెంచినట్లు పలు కేఫ్స్, హోటళ్ల నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ. 15 ఉన్న ఇరానీ చాయ్ ధర రూ. 20 అయింది. పాలు, టీ పౌడర్, చక్కెర రేట్లు పెరిగిన కారణంగానే ఇరానీ చాయ్ ధరలు పెంచినట్లు స్పష్టం చేశారు.
వీటితో పాటు కమర్షియల్ కూకింగ్ గ్యాస్ ధరలు కూడా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తుందన్నారు. డెయిరీ కంపెనీలు లీటర్ పాలపై రూ. 2 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల మధ్య ఇరానీ చాయ్ ధర పెంచక తప్పలేదని కేఫ్స్ నిర్వాహకులు వెల్లడించారు.
అయితే పెరిగిన ధరలు చాయ్ బిజినెస్‌పై ప్రభావం చూపుతుందని కొంతమంది టీ స్టాల్ నిర్వాహకులు వాపోయారు. చాయ్ ధరలను పెంచడం పట్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
అయితే లాక్డౌన్ కంటే ముందు ఒక కప్పు ఇరానీ చాయ్ ధర రూ. 10గా ఉండే. 2020లో లాక్డౌన్లో ఆర్థికంగా నష్టపోవడంతో.. చాయ్ ధరను రూ. 15కు పెంచారు. ఇప్పుడు పాలు, చక్కెర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోవడంతో మరోసారి చాయ్ ధరలను పెంచారు.