సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): డ్రగ్ స్మగ్లింగ్‌లో అంతర్రాష్ట్ర ముఠాలు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. తాజాగా మైనర్లతో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్న విషయాన్ని రాచకొండ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఏపీకి చెందిన ఓ మైనర్ రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హాష్ ఆయిల్‌ను విక్రయించేందుకు యత్నిస్తుండగా మల్కాజిగిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైనర్ బాలుడు జి.మాడ్గులోని ఏపీఆర్ స్కూల్లో 6వ తరగతి మధ్యలోనే ఆపేశాడు. చదువు ఇష్టం లేకపోడంతో వ్యవసాయదారులైన తల్లిదండ్రులకు సాయం చేస్తూ ..అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే ఒడిశా, చిత్రకొండకు చెందిన దెబేంద్ర జోద్య అలియాస్ శ్రీనుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి హైదరాబాద్‌కు గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. దెబేంద్ర జోద్య 51 కిలోల హాష్ ఆయిల్‌ను సేకరించి మైనర్‌కు అప్పగించాడు.
హైదరాబాద్‌కు వెళ్లి శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసే వారికి ఇచ్చి రావాలంటూ సూచించాడు. దీంతో 15వ తేదీన హాష్ ఆయిల్ తీసుకొని హైదరాబాద్‌కు ట్రైన్లో బయలుదేరాడు. శుక్రవారం ఘట్కేసర్ రైల్వేస్టేషన్లో దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అనుమానం వచ్చిన మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు బాలుడిని ఆపి బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. హాష్ ఆయిల్ బయటపడింది. అదుపులోకి తీసుకొని ఆరా తీయగా.. తనకు దెబేంద్ర జోద్య అందించాడని తెలిపాడు. దీంతో బాలుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద ఉన్న హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఏసీపీ సి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.