సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నానక్‌రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్‌చేంజ్‌లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కార్యాలయం సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నది. ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌జీసీఎల్ కార్యాలయం నుంచి ఎంఏయూడీ పరిధిలోని పలు శాఖలతో ఉన్నతాధికారులు, ఆయా శాఖలు చేపట్టే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా పురపాలక శాఖకు సంబంధించిన కార్యకలాపాలకు ఇది ఎంతో అనువుగా ఉండటంతో ఇక్కడి నుంచే ఆ శాఖ పరిధిలోని జీహెచ్ఎంసీ,
హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ (ఎంఆర్డీసీఎల్) వంటి శాఖల ఉన్నతాధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నానక్‌రాంగూడ హెచ్‌జీసీఎల్ భవనాల వద్ద భద్రతపరంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి వద్దే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కూడా ఉండటంతో ఇక్కడే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం కూర్చునేందుకు ప్రత్యేకంగా చాంబర్‌తో పాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు సెమినార్ హాళ్లను సిద్ధం చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా భవనం చుట్టూ మార్పులు చేస్తున్నారు.
Nanakranguda Outer Ring Roa
సీఎం క్యాంప్ ఆఫీస్‌కు అనువుగా ఉంటుందనే ఆలోచనతోనే హెచ్ఎండీఏ పరిధిలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడి నుంచే పురపాలక శాఖ పరిధిలోనే విభాగాలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కార్యాలయానికి అనువుగా ఉంటుందని ఇక్కడ ప్రత్యేక భద్రత ప్రమాణాలతో పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.1.10 కోట్లతో పనులు చేపట్టేందుకు శుక్రవారం హెచ్ఎండీఏ అధికారులు టెండర్లు పిలిచారు.
ఇందులో భాగంగా సుమారు రూ. 60 లక్షల వ్యయంతో రెండు భవనాల చుట్టూ రక్షణ కవచంగా వ్యూ కట్టర్స్‌ను, సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా త్రిభుజాకారంలో ఉన్న ఈ భవనాల చుట్టూ రోడ్లే ఉన్నాయి. దీంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ పనులకు తోడు మరో రూ. 50.02 లక్షలతో అగ్ని ప్రమాదాల నివారణ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. భద్రతపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చేయనున్నారు.
ఇప్పటికే ఈ భవనంలో ఉన్న టీఎస్ బీపాస్ కార్యాలయాన్ని మాసాబ్ ట్యాంక్‌కు తరలించారు. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాన్ని పక్కనే ఉన్న మరో భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఈ భవనంలో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్‌కు సంబంధించిన కార్యాలయం, ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కార్యాలయం ఉంది. ఈ రెండు భవనాల్లో సీఎం వచ్చిన సమయంలో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించి, మరో చోట పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.