దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ఫార్ములా ఈ రేస్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పాటు చేసిన ట్రాక్‌పై రేసింగ్ కార్లు రయ్ రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి. ప్రధాన రేస్ శనివారం ఉండగా, శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ 1 రేస్‌ను నిర్వహిస్తున్నారు. 2.8 కిలోమీటర్ల ట్రాక్‌లో మొత్తం 18 మలుపులు ఉండగా, రేసులో 11 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా 22 వేల మంది కూర్చుని రేసును తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ట్రాక్ చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టారు. ప్రేక్షకుల కోసం 16 గ్యాలరీలు ఉండగా, చిన్నారుల కోసం పీపుల్స్ ప్లాజాలో ఫ్యాన్ విలేజ్ వేదికను సిద్ధం చేశారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులు హాజరయ్యే ఈ రేస్‌పై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : రయ్ రయ్ మంటూ పరుగులు తీసేందుకు ఫార్ములా-ఈ ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమయ్యాయి. వివిధ దేశాల నుంచి ఫార్ములా రేస్ డ్రైవర్లు హైదరాబాద్ నగరం నడి బొడ్డున హుస్సేన్ సాగర్‌లో తమ సత్తా చాటనున్నారు. గంటకు 322 కి.మీ వేగంతో ఎలక్ట్రిక్ కార్లు.. హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ పేరుతో 2.8 కి.మీ మేర ఏర్పాటు చేసిన ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్‌లో దూసుకుపోనున్నాయి. తుది పోటీ ఫిబ్రవరి 11న శనివారం జరుగుతుండగా, అంతకుముందు శుక్రవారం ఫ్రీ ప్రాక్టీస్ రేస్‌లను నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేసింగ్ అనుభూతిని పొందేలా ట్రాక్ చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేసి, డ్రైవింగ్ చేస్తున్న కార్లను ప్రత్యక్షంగా చూసేలా గ్యాలరీలను నిర్మించారు. రేసింగ్ ట్రాక్‌ను ఒకవైపు నుంచి మరో వైపుకు దాటేందుకు 4 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను తాత్కాలిక ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు.
ఇందులో ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జీ మొదటి నుంచి శాశ్వత ప్రాతిపదికన ఉండగా, మరో మూడింటిని ఎన్టీఆర్ ఘాట్ వెనక వైపు, మింట్ కాంపౌండ్, ఐమ్యాక్స్ ఎదురుగా ఏర్పాటు చేశారు. దీంతో ఫార్ములా -ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నా ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రేక్షకుల గ్యాలరీల వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. రేసింగ్‌లో పాల్గొనే డ్రైవర్లందరూ, వారి కార్ల కోసం ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ స్థలంలో కస్టమైజ్డ్ గ్యారేజీలను అత్యాధునిక శైలిలో నిర్మించారు.
అత్యధిక టికెట్ ధర రూ.1.25లక్షలు..
అంతర్జాతీయ ఆటో స్పోర్ట్స్ గేమ్‌గా ప్రసిద్ధించిన ఫార్ములా-ఈ పోటీలు వీక్షించేందుకు 2.8 కి.మీ పొడువునా ట్రాక్ చుట్టూ 16 చోట్ల ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేయగా, సుమారు 22వేల మంది కూర్చునేలా సీట్లను, ఇతర మౌలిక వసతులను కల్పించారు. ఇందులో 6 రకాలుగా టికెట్ రేట్లను నిర్ణయించారు. రూ.1000, రూ.4,000, రూ.7,000, రూ.10,500, రూ.65,000లు రూ.1,25,000 వేలుగా నిర్ణయించారు. గురువారం నాటికి వెయ్యి, రూ.4వేలు,రూ.10,500 టికెట్లు అమ్ముడుపోగా, మిగతావి బుక్‌మై షో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. రూట్ మ్యాప్ ద్వారా ట్రాక్ చుట్టూ ఎక్కడ ఏ గ్యాలరీ ఉందో అర్థమయ్యేలా వెబ్సైట్లో పొందుపర్చారు. నగరం నుంచి వివిధ మార్గాల నుంచి వచ్చే వారికి పలు చోట్ల నుంచి ఎంట్రీ గేట్లను ఏర్పాటు చేశారు. మీడియా గ్యాలరీని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో గ్రీన్ లాంజ్ పేరుతో వీఐపీల కోసం ఏర్పాటు చేయగా, వీవీఐపీల కోసం ఏస్ లాంజ్‌ను రేస్ ముగింపు పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు..
హైదరాబాద్ మహానగరంలో మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా -ఈ రేసింగ్ పోటీలు జరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది. రేసింగ్ జరిగే ట్రాక్ చుట్టు పక్కల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలను దూరంగా ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల్లో ట్రాక్ వద్దకు చేరుకునే సౌకర్యం కల్పించారు. రెండు రోజుల క్రితమే నగరానికి చేరుకున్న హెచ్ఎండీఏ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పార్కింగ్ ప్రదేశాలనుంచి రేసింగ్ ట్రాక్ వద్దకు నడిపేలా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు.
సాగరతీరం సరికొత్తగా..
హుస్సేన్‌సాగర్ తీరం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. ఫార్ములా -ఈ తో ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న హుస్సేన్‌సాగర్ అద్భుతాలకు నిలయంగా మారుతున్నది. నగర వాసులను అలరించేలా హుస్సేన్ సాగర్ జలాల్లో నూతనంగా మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్‌ను గురువారం రాత్రి ప్రారంభించారు. దీనికితోడు ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్ చుట్టు పక్క తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం, దానికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం, మరో వైపు ఐమ్యాక్స్ వెనక, ఎన్టీఆర్ గార్డెన్‌ను ఆనుకొని 125 అడుగుల ఎత్తయిన భారీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు సాగర్ జలాల్లో కొలువుదీరి బుద్ద విగ్రహం మరింత ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్,సికింద్రాబాద్ జంటనగరాల వారధిగా ట్యాంక్‌బండ్ ఇప్పటికే సరికొత్త శోభను సంతరించుకొంది. ఫార్ములా-ఈ పోటీలతో సాగర తీరమంతా ఎన్నో అద్భుతాలతో కూడిన ప్రాంతంగా నిలవనుంది.