వనస్థలిపురం, జూలై 12: అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో సంభవించిన అగ్నిప్రమాదం ఉలికిపాటుకు గురిచేసింది. వనస్థలిపురం జాతీయరహదారి పక్కన ఉన్న సుబ్బయ్యగారి హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.35 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్లో నిద్రిస్తున్న 42 మంది సిబ్బందిని కాపాడారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
పోలీసులు స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెను ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే నైట్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ జలంధర్‌రెడ్డి తన సిబ్బందితో 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఫైర్ ఇంజన్లను రప్పించారు. విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి సరఫరాను నిలిపివేయించారు. 4వ అంతస్తులో చిక్కుకున్న 42 మంది హోటల్ సిబ్బందిని కాపాడి సురక్షితంగా వెనుక నుంచి బయటకు తీసుకువచ్చారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మంటలు హోటల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను తాకితే జరిగే నష్టాన్ని ఊహించలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.