నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాజీయే రాజ మార్గమని, గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో తక్కువ సమయంలోనే కేసులు పూర్తవుతున్నాయని నాంపల్లి కోర్టు 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అరుణకుమారి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయంతోపాటు డబ్బులు పోగొట్టుకునే అవకాశం అధికంగా ఉండేదని, జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడంతో కక్షిదారులు కేసులను రాజీ చేసుకుంటున్నారన్నారు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు లోక్ అదాలత్ ఉపయుక్తంగా ఉన్నదన్నారు.
కోర్టుకు వెళ్లితే చాలు సమయం వృధా అవుతుందనే ఆలోచన సామాన్యుడికి ఉంటుందని, అందుకు పెండింగ్‌లో ఉన్న కేసులతో కొత్త కేసులను కోర్టులు విచారణకు స్వీకరించకపోవడం జరుగుతుందన్నారు. నాంపల్లి కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్యవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. గత లోక్ అదాలత్‌లో అధిక కేసులను తొలగించి హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలువడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా రాజీ చేసుకున్న ఇరువర్గాలకు చెందిన కక్షిదారులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి డీసీపీ మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాంరెడ్డి, సూపరింటెండెంట్ సుజాత, సిబ్బంది సుభాష్‌చంద్ర, ఫాతిమా, సలీం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.