సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌ను కొలువుల ప్రవాహం ముంచెత్తింది. వేలాది ఖాళీ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపడంతో గ్రేటర్ పరిధిలోని నిరుద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాస్థాయి పోస్టుల భర్తీ ఉండటం విశేషం. వీటితో పాటు జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టుల్లోనూ గ్రేటర్ నిరుద్యోగులకు సదావకాశం ఉండటంతో ఉద్యోగార్థులు చదువుల కుస్తీకి సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షలకు కోచింగ్ మొదలు అన్నిరకాల వసతులకు హైదరాబాద్ కేంద్ర బిందువు కావడంతో ఇకపై నగర ముఖచిత్రమే మారనుంది. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు… ఒకటేమిటి ! ఎక్కడ చూసినా పుస్తక పఠనంతో నిరుద్యోగులు కనిపించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల జాతరలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పోస్టుల పంట పండింది. శాసనసభలో బుధవారం సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో నిరుద్యోగులు పోటీ పరీక్షల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. జిల్లాస్థాయి పోస్టుల జాబితాలో 39,829 ఖాళీ పోస్టులు ఉండగా… ఇందులో గ్రేటర్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే ఏకంగా 21 శాతం పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా 5268 జిల్లాస్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో నిజామాబాద్ ఉండగా… తదుపరి మూడు, నాలుగు స్థానాల్లో మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలోని నిరుద్యోగులకు జిల్లాస్థాయి పోస్టుల్లో పుష్కలమైన అవకాశాలు లభించనున్నాయి. దీంతో పాటు జోనల్ స్థాయిలోని 5,297, మల్టీ జోనల్ స్థాయిలోని 6,370 ఖాళీ పోస్టుల్లోనూ గ్రేటర్ పరిధిలోని ఉద్యోగార్థులు పోటీ పడేందుకు సదావకాశాలు ఉన్నాయి.
పుస్తకాలతో కుస్తీ…
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా కోచింగ్, మెటీరియల్ సేకరణ తదితర అవసరాలకు భారీ ఎత్తున నిరుద్యోగులు హైదరాబాద్‌ను ఆశ్రయించనున్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో ఇక నుంచి నగర ముఖచిత్రమే మారనుంది. అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, ఎస్సార్‌నగర్ వంటి ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడటంతో పాటు కోఠి ప్రాంతంలోని పుస్తక విక్రయ దుకాణాలు వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదు
రాష్ట్రంలో ఒకేసారి 80,039 ఉద్యోగాల భర్తీకి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎన్నడూ జరుగలేదు. భారీ రిక్రూట్మెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్లే సాధ్యమైంది.
– ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్
స్వాగతిస్తున్నాం..
తెలంగాణ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 80,039 పోస్టుల భర్తీకి ఒకేసారి ప్రకటన చేయడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చాలా సంతోషంగా ఉంది. జేఎన్టీయూలో 241 టీచింగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తాం. అలాగే నాన్‌టీచింగ్ పోస్టులనూ భర్తీ చేస్తాం.
– జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
అసెంబ్లీసాక్షిగా 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, వయోపరిమితి పెంపు, 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– గోనే విష్ణువర్ధన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ రిజిస్ట్రేషన్ జేఏసీ చైర్మన్
తీపి కబురు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంబి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ టీ హరికృష్ణ, ఎండి అబ్దుల్ ఖాదర్, ట్రెజరర్ శ్రీనేష్‌కుమార్, సునీత జోషి, బి స్వరూప రాణి, తనూజ, భాను ప్రసాద్, ఎన్ సురేందర్, కిశోర్, అనంద్ తదితరులు పాల్గొన్నారు.
లైబ్రరీలు కళకళ
ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో గ్రేటర్‌వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు కిటకిటలాడనున్నాయి. ప్రధానంగా చిక్కడపల్లి, అఫ్జల్‌గంజ్ లైబ్రరీలతోపాటు అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, అమీర్పేటల్లోని కోచింగ్ కేంద్రాలు రద్దీగా మారనున్నాయి.
నిరుద్యోగ సమస్యకు చెక్
రెండేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న నా కోరిక నెరవేరుతుందో లేదోనని అనుకున్నాను. ఒకేసారి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.
– ప్రీతి, బీకామ్ కంప్యూటర్స్