మహేశ్వరం, మే 7: మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఇందులోభాగంగా మహేశ్వరం మండలంలో 19 పాఠశాలలను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
మొదటి విడుతలో..
మన ఊరు మన బడి కింద సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం మహేశ్వరం మండలానికి మొదటి విడుతలో రూ.4.70కోట్లు మంజురైనట్లు అధికారులు తెలిపారు. కాగా, మన ఊరు- మన బడిలో భాగంగా పెద్ద ఎత్తున పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించడంపై వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వసతులు..
మన ఊరు-మనబడిలో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందులో పాఠశాలలో మరమ్మతులు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీరు, విద్యుత్, వంటగదులు, పచ్చదనం వంటి ఉన్నాయి. ఇందుకోసం డీఈ లకు రూ.30 లక్షల వరకు అథారిటీ, రూ.50 లక్షలు ఈఈలకు, రూ.2 కోట్ల వరకు సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు పనులను చేసే వెసులు బాటును ప్రభుత్వం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. మంజూరైన డబ్బులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యాకమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
యజ్ఞంలా నిర్వహిస్తాం..
మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తాం.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేసి విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం. ప్రతి పాఠశాలలో గ్రీనరీ, పెయింటింగ్, తాగునీరు, వంటగదులు, టాయిలెట్లు, ఆటలు, ఇంటర్నెట్ వంటి 12 అంశాలపైన వసతులు కలిపిస్తాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తాం. వచ్చే అకాడమిక్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ బోధన తరగతులను ప్రవేశపెడుతున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చదివించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
రూపురేఖలు మారుతాయి..
మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారుతాయి, మహేశ్వరం మండలంలో 19 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులను కలిపిస్తాం. గ్రీనరీ, వంటగది, నీటి వసతి, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సమస్యలు లేకుండా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన నిధులను డీఈ, ఈఈ, సూపరింటెండెంట్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. హెచ్ఎం, విద్యాకమిటీ చైర్మన్కు జాయింట్ చెక్ పవర్ ఉంది.
– కృష్ణయ్య, మండల విద్యాధికారి