సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,మే 3 (నమస్తే తెలంగాణ):తెలంగాణ ఏర్పడక ముందు ఎండాకాలం వచ్చిందంటే నగరంలోని మధ్యతరగతి వారు ఇన్వర్టర్ల కోసం ఎగబడితే… అపార్టుమెంటువాసులు,ఆర్థికంగా ఉన్నవారు జనరేటర్ల వైపుచూసేవారు. రాత్రివేళల్లోనూ కరెంటు కోతలతో కాలనీలు, బస్తీల్లోని సాధారణ జనం కాలనీలు అవకాశం ఉంటే ఇంటి పైకప్పు లేకపోతే ఇంటి ముందు అవస్థలు పడేవారు. కానీ ఇప్పుడు?! 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.కానీ ఏ ఒక్క ఇంట్లో ఇన్వర్టర్లు లేవు. కారణం క్షణం పాటు కూడా కనిపించని కరెంటు కోతలు. ఇక సామాన్యుడు సర్రుమంటున్న ఎండలతో ఇంట్లోనే కూలర్లు, ఆర్థికంగా ఉన్నవారు ఏసీలతో సేద తీరుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండటంతోమండు వేసవిలో కూల్.. కూల్‌గా.. గడుపుతున్నాడు.
దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఇప్పుడు కరెంటు సంక్షోభం ఉంది. కేంద్ర సర్కారు నిర్లక్ష్యం… కొరవడిన ముందుచూపు… కారణమేదైనా! ఇప్పుడు అనేక మెట్రో నగరాల్లోనూ జనం అవస్థలు పడుతున్నారు. రేపటి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో?! అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు… విద్యుత్ వ్యవస్థను పకడ్బందీ చేసిన తీరుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రెప్పపాటు కూడా కరెంటు పోవడమనేది లేకపోవడంతో నగరవాసులు ఏ చింత లేకుండా సేద తీరుతున్నారు. ముంబైలాంటి ఆర్థిక రాజధానిలోనూ గంటలకొద్దీ అంధకారం అలముకుంటుంది. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. కానీ నగరంలో మాత్రం ఇంత కంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా సరే నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధమేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ భరోసా కల్పిస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోనూ భారీస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుమారు 40-42 డిగ్రీల సెల్సియస్ మధ్యలో రోజువారీ ఉష్ణోగ్రతలు ఉండటంతో ఒక్కసారిగా కరెంటు డిమాండ్ పెరుగుతుంది. గత నెల 27న ఈ సీజన్ గరిష్ఠంగా 71.49 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. సోమవారం కూడా 3200 మెగావాట్ల డిమాండ్ ఉండగా… వినియోగం 71 మిలియన్ యూనిట్ల వరకు ఉందని అధికారులు చెప్పారు. అంతేకాదు… వచ్చే నెలలో కరెంటు డిమాండ్ రోజుకు 3800 మెగావాట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలోనూ నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇస్తున్నారు. వీటికి తోడు హైదరాబాద్ మెట్రో రైలుకు నిరంతరాయంగా కరెంటు సరఫరా కొనసాగుతుంది. మెట్రోకు రోజుకు నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా.. ఇందులో కేవలం 14 శాతం సోలార్ ద్వారా ఎల్అండ్టీ సమకూరుస్తున్నది. అంటే మిగిలిన 86 శాతం కరెంటు సరఫరాను ప్రత్యేక లైన్ల ద్వారా ట్రాన్స్‌కో అందిస్తుంది. ఒకవైపు దేశంలోని మెట్రో నగరాల్లో నివాస గృహాలకు గంటల కొద్దీ కరెంటు కోతలు విధించడంతో పాటు ఢిల్లీలో మెట్రో, ఆస్పత్రులకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ ఒక్క హైదరాబాద్‌లోనే కరెంటు వెతలనేవి జనం ఆలోచనల్లో కూడా లేకుండా పోయాయి.
ఇంట్లోనే చల్లగా..
కాలనీలు, బస్తీలలో 24 గంటల కరెంటు ఉంటుంది. నిరంతరంగా కరెంటు ఉండడం వల్ల నాలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు షిఫ్టులలో పని చేసినా కరెంటు వల్ల ఇబ్బందులు లేవు. ఇంట్లోనే ఉండి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద సుఖంగా జాబులు చేసుకుంటున్నాం.
– బొల్లిపల్లి సిద్ధార్థ, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కేపీహెచ్‌బీ కాలనీ
కరెంట్ కష్టాలు తీరాయి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కష్టాలను దగ్గరుండి చూశాం. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాతో కష్టాలు తప్పాయి. వేసవి కాలం వచ్చిందంటే కరెంటు ఉంటుందో, పోతుందో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం కరెంట్ కొరతకు రాష్ట్ర సర్కారు చెక్ పెట్టింది. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండటం సంతోషంగా ఉంది.
బయట వేడిగా.. ఇంట్లో కూల్‌గా..
ఉదయం నుంచి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. విపరీతమైన ఎండలకు కాలు బయట పెట్టాలంటేనే ప్రాణం పోతుంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం కరెంట్ బాధలు తప్పడంతో ఇంట్లోనే ఉంటూ ఏసీ, కూలర్లను వినియోగిస్తుడటంతో చల్లగా ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో విద్యుత్ కోతలు లేకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనం. అసలే వేసవి కాలం కావడంతో ఎండలు దంచుతున్న సమయంలో ఇంట్లో కూలర్, ఫ్యాన్లు, ఏసీల కింద సేద తీరుతున్నాం.
– శేఖర్, తిరుమలగిరి
ఎండ వేడిమిని తట్టుకుంటున్నాం
కరెంట్‌ను 24 గంటల పాటు ప్రభుత్వం సరఫరా చేయడం వల్లే ఎండ వేడిమిని తట్టుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినా కరెంట్ కోతలు లేకపోవడంతో ఇంట్లో కూలర్లను ఉపయోగించుకుని కుటుంబ సభ్యులందరం సేద తీరుతున్నాం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కరెంట్ కోతలు లేవు. ఎండలు ఎంత దంచి కొట్టినా ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకుంటున్నాం.
– సుందర్రావు, దమ్మాయిగూడ
కరెంట్ లేకుంటే పరిస్థితి కష్టం
ఎండలు విపరీతంగా పెరిగిన సమయంలో కరెంట్ లేకుంటే పరిస్థితి కష్టంగా ఉండేది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారూ వచ్చినప్పటి నుంచి కరెంట్ పోయిన దాఖాలాలు తక్కువే. ఎండలు పెరిగినా కరెంట్ 24 గంటలు ఉండటంతో కూలర్లు, ఫ్యాన్ల ద్వారా ఉక్కపోత నుంచి రక్షించుకుంటున్నాం.
సమర్థతకు తార్కాణం
ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయినా ఇండ్లలో హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అందుకు ప్రధాన కారణం నిరంతరాయ కరెంట్ సరఫరా. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. ఇది తెలంగాణ సమర్థతకు తార్కాణం.
చదువులకు ఆటంకాలు లేవు
పరీక్షల కాలం వచ్చిందంటే చాలు కరెంటు కోతలతో చదువులకు ఇబ్బంది పడేవాళ్లం. 24 కరెంటు ఉండడం వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం. ఇంట్లోనే చదువుకుంటున్నాం. కరెంటు సమస్య లేకపోవడం వల్ల ఎక్కువగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నాం.
విద్యుత్ సరఫరా సంతోషకరం
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎండలు మండుతున్నా.. ఫ్యాన్లు, ఏసీల వద్ద ఉంటూ ఉపశమనం పొందుతున్నాం. రాష్ట్రంలో విద్యుత్‌కు అంతరాయం లేకుండా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు హర్షదాయకం.
– అభిజిత్ జైస్వాల్
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు కరెంటు కోతలతో ప్రజలను పరేషాన్ చేసేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ 24 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. ఎండాకాలం అనే తేడా లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
– దివ్య, గృహిణి, మార్కండేయనగర్
రోజంతా కరెంట్ ఫుల్..
తెలంగాణ వచ్చిన నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా ఇండ్లలో కరెంట్ సమస్య లేదు. రోజంతా ఫుల్ కరెంటు ఉంటుంది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ వచ్చిన నుంచి వేసవిలో కరెంట్ సమస్య లేకుండా నిరంతరం ఉంటుంది.
– నవ్వ, శంషాబాద్, గృహిణి