సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ):క్రికెట్ బెట్టింగ్ దందా రూపు మార్చుకుంటోంది. పందెపు రాయుళ్లు పోలీసులను ఏమార్చేందుకు కొత్త దారులను వెతుకుతున్నారు. నిఘా పెరగడంతో బెట్టింగ్ ముఠాలు కొత్త స్థావరాలను ఎంచుకుంటున్నారు. స్థానిక పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కార్లలో ప్రధాన నగరాలు, ఇతర రాష్ర్టాల్లో తిరుగుతూ.. బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. నాలుగేండ్లుగా కార్లలో తిరుగుతూ హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన బూకీని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో మరింత మందిని కటకటాల్లోకి పంపించారు. రెండు వేర్వేరు ఘటనల్లో బెట్టింగ్ రాయుళ్ల నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌పోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ రమణారెడ్డి వివరాలు వెల్లడించారు.
సికింద్రాబాద్ సింధికాలనీలో నివాసముండే అమిత్ నిరంజన్ దోషి అలియాస్ అమిత్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహణలో ఆరితేరాడు. కార్లలో తిరుగుతూ బెట్టింగ్ నిర్వహించడంలో దిట్ట. నాలుగేండ్లుగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గోవా తదితర ప్రాంతాల నుంచి క్రికెట్ బెట్టింగ్ దందాను నిర్వహిస్తున్నాడు. అన్ని నగరాల్లో సబ్ బుకీలను, కలెక్షన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లో ఏర్పడిన పరిచయాలతో గోవా క్యాసినోకు కస్టమర్లను తరలిస్తూ కమీషన్ పొందుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం అమిత్‌ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో అతడి వద్ద కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్న బోజ్జ భూపాల్యాదవ్, ల్యాప్‌టాప్ ఆపరేటర్ నిఖిల్ గుప్త, బెట్టింగ్ లైన్ ఆపరేటర్ ప్రవీణ్ సార్న, ఖాతాలు రాసేందుకు ఏర్పాటు చేసిన యాష్కుమార్ అరోరాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా వద్ద నుంచి రూ.15.65 లక్షల నగదు, బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్న ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఎప్పటికప్పుడు.. మకాం మారుస్తూ..
క్రికెట్ బెట్టింగ్ దందా గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అమిత్ తనదైన ైస్టెల్లో నాలుగేండ్లుగా దందా సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారనగానే ఇంటికి కూడా వెళ్లడు. ఇతర నగరాల్లో తిరుగుతూ అక్కడి నుంచి తన ఏజెంట్ల ద్వారా ఆన్లైన్ దందా సాగిస్తుంటాడు. తన వద్ద పనిచేసే ఏజెంట్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వారి మకాం మారుస్తుంటాడు. పోలీసుల నిఘా పెరిగిందంటే కార్లు ఏర్పాటు చేసుకొని సిటీలో తిరుగుతూ బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. ముంబై, గోవాకు ఎక్కువగా వెళ్లి వస్తుంటాడు. ప్రత్యేకంగా గోవాలో ఉండే క్యాసినో నిర్వాహకులతో కాంట్రాక్టు కుదర్చుకున్నాడు. క్యాసినోకు కస్టమర్లను పంపించి, వారు పెట్టుబడి పెట్టేదానిపై 20శాతం వరకు కమీషన్ పొందుతున్నాడు. క్యాసినోలో అన్ని రకాలైన సేవలు అందిస్తామంటూ నమ్మించి హైదరాబాద్ నుంచి అనేక మందిని తీసికెళ్లాడు.
ఎనిమిదేండ్లుగా దందా.. మరో ముఠా అరెస్ట్
సికింద్రాబాద్ సింధి కాలనీకి చెందిన పడాల మహేశ్‌బాబు బిల్డర్. ఎనిమిదేండ్లుగా క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నాడు. గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా తీరు మారలేదు. అదే ప్రాంతానికి చెందిన శ్యాంసుందర ముండాలను తన బెట్టింగ్ భాగస్వామిగా నియమించుకొని తన కొడుకు పడాల జగత్‌ను మనీ కలెక్షన్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎండీ నవాజ్ ఖాన్, మహేంద్రకుమార్ అగర్వాల్, ఆనంద్ ప్రతీక్, సురేశ్ నవీన్ కింగర్, గోవింద్ యాదవ్‌లను తన బెట్టింగ్ దందాలో వివిధ పనులు చేసేందుకు నియమించుకొని ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. తన అడ్డాలో బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసుల రైడింగ్‌లో పట్టుబడుతామనే భయంతో సింధికాలనీలోని ప్రశాంత్ అపార్టుమెంట్ పక్కన పార్కు చేసిన కారులో నుంచే బెట్టింగ్ దందా సాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్ పేట్ పోలీసులు దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.4.5 లక్షల నగదు, హెక్టార్ కారుతో పాటు ఇతర బెట్టింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, రాంగోపాల్ పేట్ ఇన్స్పెక్టర్ సైదులు, తదితర అధికారులు పాల్గొన్నారు.