సికింద్రాబాద్, జనవరి 3: కంటోన్మెంట్ బోర్డు అధికారుల అవివ్యాజ్య ప్రేమ కారణంగా కంటోన్మెంట్ స్థలాల్లో ఉన్న క్రీడా మైదానాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. బోర్డు సీఈఓతో పాటు ఇంజినీరింగ్ అధికారుల ఒంటెద్దు పొకడలతో మైదానాల గుత్తాధిపత్యం ప్రైవేట్ వ్యక్తుల గుప్పట్లోకి వెళ్లాయి. బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్, బొల్లారంలోని కంటోన్మెంట్ పార్కు, సిఖ్‌విలేజ్ సమీపంలోని దోభీఘాట్ ప్రాంతంలోని మైదానాలను 2017లోనే ఎమ్మెల్యే సాయన్న అప్పటి క్రీడాశాఖ మంత్రి పద్మారావుగౌడ్‌కు లేఖ రాస్తూ మినీస్టేడియాలుగా వీటిని రూపుదిద్దుకునేలా చేయాలని పేర్కొన్నారు. దీనిని సంబంధిత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి మినీ స్టేడియాలుగా మార్చే అంశాన్ని పరిశీలించే విధంగా ప్రతిపాదన చేశారు. కంటోన్మెంట్‌లోని మూడు మైదానాలను అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర సర్కారుకు అప్పగించాలని కంటోన్మెంట్ బోర్డుకు అప్పటి కలెక్టర్‌ను కోరుతూ లేఖ రాయడం జరిగింది. అయితే బోర్డు సమావేశంలో అధికారులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అప్పటి నుంచి కలగానే మినీ స్టేడియాల నిర్మాణం మిగిలింది. ఇటీవల కాలంలో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్‌గా ఉన్న ప్రైవేట్ వ్యక్తులు కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తామని అధికారులను మచ్చిక చేసుకుని ముందుకుసాగుతున్నారు. రాష్ట్ర సర్కారుకు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేసిన బోర్డు అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంలో మాత్రం ఏ మతలబు ఉందో వారికే తెలియాలి.
ఎకరం స్థలంలో ప్లే గ్రౌండ్..
బోయిన్పల్లి ప్రధాన రహదారికి వెంట ఉన్న బీ4 స్థలంలో జేఎల్ఆర్(జనరల్ల్యాండ్రికార్డ్సు) సర్వే నంబ ర్ 558లో సుమారు 5 ఎకరాల స్థలం ఉంది. దీంట్లో ఎకరం స్థలం మేర కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ ఉంది. దీన్ని మినీ స్టేడియంగా మార్చితే కంటోన్మెంట్‌లోని పేద, మధ్య తరగతికి చెందిన క్రీడాకారుల అభివృద్ధికి ఈ మైదానాన్ని వినియోగించేలా ఉండేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పినా, అంగీకరించని బోర్డు అధికారులు, ఇటీవల మాత్రం ప్రభుత్వం వద్దు…ప్రైవేట్ వ్యక్తులే ముద్దు అంటూ వాళ్లు తీసుకుంటున్న చర్యలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. మరోవైపు బీ-4 స్థలాల్లో కంటోన్మెంట్ బోర్డు నేరుగా నిధులు వెచ్చించే అవకాశం లేదు. కానీ బోర్డు సీఈఓ ఏకంగా ఇప్పటికే రూ.5లక్షలతో పలు అభివృద్ధి పనులు చేశామని, మరో రూ.10లక్షలతో వాకింగ్ ట్రాక్, ఫుట్‌బాల్ కోర్టు, రెజ్లింగ్,జిమ్గదుల మరమ్మతులు చేపట్టే విధంగా పను లు ముమ్మరం చేయాలని ఇంజినీరింగ్ అధికారికి ఆదేశాలు ఇవ్వడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత స్థలాన్ని సీ కేటగిరిలోకి మారిస్తేనే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్లే గ్రౌండ్లో ఉన్న ఓ గది సైతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.
ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం
కేంద్ర సర్కారు ఆధీనంలో ఉన్న భూములతో పాటు మైదానాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే పనిలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు పడ్డట్లు తెలుస్తోంది. బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్‌ను విరాళాలతో అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చిన పలువురు ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిన బోర్డు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర సర్కారు మైదానాలు అప్పటించేందుకు ససేమిరా అన్న అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం అప్పనంగా అప్పజెప్పడం ఏంటో అధికారులే చెప్పాలి. కంటోన్మెంట్లో కొంతమంది వ్యక్తులపై బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారుల అతి ప్రేమపై కంటోన్మెంట్ వాసులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకేమీ సంబంధం లేదని చెప్పే బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సోమవారం కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో పర్యటించింది…అధికారిక పర్యటనా లేక వ్యక్తిగత సందర్శననో పెదవి విప్పితేనే తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులను పలుమార్లు ఫోన్లో సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. ఒకరి జేబులోని వ్యక్తులుగా చెలామణి ఆవుతున్న అధికారులు ఇప్పటికైనా వెనుక జరుగుతున్న తంతుపై నోరు మెదుపుతారో లేదో వేచి చేడాల్సిందే…!