కవాడిగూడ, మే 3: ఎన్నో ఏండ్లుగా నిరుపేదల కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అద్భుతమని, ఆ సేవల్ని మరువలేనివని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని హోటల్ మారియట్‌లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టీపుల్ డిస్ట్రిక్ట్ ఎండీ 320 ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఉచిత భోజన సౌకర్యం కల్పించేందుకు ‘ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్’ అనే పేరుతో 20 వాహనాలతో పాటు, అంబులెన్స్ వాహనాన్ని ఇంటర్నేషనల్ మూడో వైస్ ప్రెసిడెంట్ ఏపీ పింగ్, ఫ్యాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్.సునీల్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో ఉన్న ధనవంతులు లయన్స్ క్లబ్‌కు సహాయ సహకారాలు అందించినైట్లెతే వారి జన్మ ధన్యమవుతుందని అన్నారు. నేడు దేశం ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, 65 ఏండ్ల బాధలన్నింటిని పోగొట్టడానికి 24 గంటల నిరంతర కరెంట్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నిరుపేదలకు భోజన వసతి కల్పించేలా కిచెన్ స్థలం కోసం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గేట్ ఏరియా లీడర్ భీమియా జగ్నీ, ఏఐసీఎఫ్ ఏరియా లీడర్ డాక్టర్ జి.బాబురావు, వైస్ చైర్మన్ లక్ష్మీ నర్సింహారావు, కార్యదర్శి జీఆర్ సూర్యరాజ్, కోశాధికారి దుర్గావాణి సురభి, ఎస్.రాధాకృష్ణ, విద్యాసాగర్ రెడ్డి, ఆవుల గోపాల్ రెడ్డి, డాక్టర్ టి. రామకృష్ణారెడ్డి, కోటేశ్వర్ రావు, రాజిరెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.