మాదాపూర్, ఏప్రిల్ 29: హైదరాబాద్ మహా నగరం త్వరలో హెల్త్ హబ్‌గా అవతరించనుంది. పలు రకాల చికిత్సల నిమిత్తం నగరానికి దేశ వ్యాప్తంగా దారులు ఏర్పడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా వైద్య రంగంలోనూ నగరం దూసుకుపోతున్న రీత్యా హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా అవతరించడమనేది ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది. పరిస్థితులు అందుకు అనుకూలంగానే ఉన్నాయి. “జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ తన తల్లికి నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చికిత్స చేయిస్తున్నారు. నిన్న రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలుసుకుని మాట్లాడుతున్న సందర్భంగా ఏఐజీ ఆస్పత్రికి జార్ఖండ్ రాష్ట్రం, తమ నియోజకవర్గానికి చెందిన అనేక మంది చికిత్స కోసం వచ్చారని, తాను వెళ్లినపుడు వారు కలిసేందుకు వచ్చారని చెప్పారు.
వీరే కాదు… వైద్యం కోసం దాదాపు 60-70 దేశాలతో పాటు చత్తీస్గడ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి నగరంలోని ఆధునిక వైద్యం కోసం వస్తారు” అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్స్‌లో శుక్రవారం జరిగిన పదకొండో ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా నగర ప్రాముఖ్యత, మెరుగైన మౌలిక వసతుల కల్పనపై మాట్లాడారు. భవిష్యత్ అంతా హెల్త్ పైనే ఆధారపడి ఉంటుందని, అభివృద్ధిలో భాగంగా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తు అనేది కేవలం నిర్మాణ రంగంలోనే కాదు.. మెడికల్ రంగంలోనూ ఉందన్నారు.
త్వరలో త్రిపుల్ ఆర్ ప్రారంభం…
అభివృద్ధిలో భాగంగా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఇప్పటి వరకు 140 లింకు రోడ్లను తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రహదారుల సౌభాగ్యంతోనే చుట్టు ప్రక్కల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటి వరకు 19 నూతన రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్ వేగంగా దూసుకుపోతుందని, చదరపు అడుగుకు సరాసరి రూ.4,450 చొప్పన నగరంలో ఇంటి ధరలు ఉన్నట్లు తెలిపారు. 330 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డును త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
మత కల్లోహాలు, ఇతరత్రా వాటికి చోటివ్వకుండా ఉంటే మరో 10-15 సంవత్సరాల వరకు హైదరాబాద్ అభివృద్ధికి ఎటువంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. శాంతి సామరస్యాలతో అందరం కలిసి బాగుంటేనే మత కల్లోలాలకు చోటు ఉండదన్నారు. గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌లో తప్పులు ఉన్నాయని, రానున్న 18 నెలల్లో వరల్డ్ క్లాస్ ఏజెన్సీని నియమించి మరో నూతన మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయనున్నట్లు తెలిపారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో ఉన్నటువంటి నీళ్లతో ఇప్పుడు అంతగా అవసరం లేదని, అలాంటప్పుడు 111 జీవో ఎత్తివేయడం వల్ల ఇంకేం ఇబ్బంది వస్తుందని అన్నారు. తెలంగాణలో నీళ్ళకు లోటు లేదని అవసరమైతే నగరానికి మరిన్ని గంటలు పెంచి ప్రజలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. 111 జీవో ఎత్తివేతతో కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. క్రెడాయ్ సభ్యులు హైదరాబాద్‌లోని చెరువులను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని క్రెడాయ్ సభ్యులను మంత్రి కేటీఆర్ కోరారు.
వెంచర్లు, నిర్మాణాల ప్రాంతాల్లో 20 ఫీట్ల రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందని అటువంటి ప్రాంతంలో ఎప్పటికైనా రోడ్ల విస్తరణ చేపట్టాల్సిందేనని అన్నారు. 20 ఫీట్ల రహదారులు ఉన్న చోట ఫెనాల్టీలు వేయగా వచ్చిన డబ్బుతో రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలన్నారు. బిల్డర్లు స్వీయ నియంత్రణ పాటించాలని లేదంటే ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌కు క్రెడాయ్ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. ప్రదర్శనలో 150కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో అపర్ణ కన్స్రక్షన్, మై హోం, జనప్రియ ఇంజనీర్స్, వాసవి గ్రూప్, సుమధుర ఇన్ఫ్రా, రాజపుష్ప ప్రాపర్టీస్, అరోబిందో రియల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ఎంఆర్ బిల్డర్స్, ఇండీస్, వర్టెక్స్, రాంకీ ఎస్టేట్స్, హాల్‌మార్క్ బిల్డర్స్, శుభగృహ, సాధన గృహ నిర్మాణ్, కాన్సెప్ట్ అంబియెన్స్ తదితర ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. నగరంలోని పలువురు సందర్శకులు స్టాల్స్‌ను వీక్షించి వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.