హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీలకు రంజాన్ చాలా ప్రత్యేకం. ముస్లింలు రోజా (ఉపవాసం) విడిచేందుకు రుచికరమైన ప్రత్యేక వంటకాలను ఆహారంగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది రంజాన్ ప్రారంభమైన ఏప్రిల్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు కోసం 4.5లక్షల ఆర్డర్లు వచ్చాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ విశ్లేషణలో మటన్ హలీమ్, చికెన్ బిర్యానీ, నిహారీలు, సమోసాలు, రబ్దీ, మాల్పువా లాంటి సంప్రదాయ వంటకాలు ఎక్కువ జనాదరణ పొందాయి. ఇదే సమయంలో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కస్టమర్లు టెండర్ కోకనట్ ఐస్‌క్రీమ్‌లను ఎక్కువగా ఆర్డర్ చేశారు. డెజర్ట్‌లలో గులాబ్ జామ్, రస్మలై, డబుల్ కా మీఠా అధికంగా అమ్ముడవగా, ఇఫ్తార్ కోసమని దాదాపు 17వేల ఇడ్లీ ఆర్డర్లు రావడం గమనార్హం.
రంజాన్ మాసం తొలి 20 రోజుల్లోనే హైదరాబాద్‌లో 8 లక్షలకు పైగా బిర్యానీలు ఆర్డర్ చేశారు.
గతేడాదితో పోలిస్తే రంజాన్ సందర్భంగా హలీమ్‌లు, నిహారీల కోసం స్విగ్గీ ఆర్డర్లు పెరిగాయి. ఈ ఏడాది దాదాపు 33శాతం అధికంగా హలీమ్ ఆర్డర్లు వచ్చాయి. మటన్ హలీమ్, స్పెషల్ హలీమ్, చికెన్ హలీమ్ ఎక్కువగా ఆర్డర్ చేసిన ప్రసిద్ధ హలీమ్ రకాలుగా నిలిచాయి. నిహారీల కోసం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 30శాతం అధిక ఆర్డర్లు వచ్చాయి.
రంజాన్ డిన్నర్ ఫేవరెట్స్‌లో కంఫర్ట్ ఫుడ్‌కు డిమాండ్ పెరిగింది. చికెన్ బిర్యానీ, హలీమ్ కాకుండా, ఇఫ్తార్ సమయంలో (సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య) వచ్చిన ఆర్డర్లలో పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశ లాంటి వంటకాలు ఉన్నాయి.
అత్యంత ప్రజాదరణ పొందిన ఇఫ్తార్ స్నాక్స్‌లో సమోసా, భజియా, రబ్దీ, ఫిర్నీ, మాల్పువా, ఖర్జూరతో చేసిన వంటకాలు ఉన్నాయి. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఇలాంటి వంటకాల కోసం నగరంలో దాదాపు 4.5లక్షల ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ పేర్కొన్నది.