మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 22: భూమి, తల్లి ఒక్కటేనని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(జీఎస్ఐటీఐ) డీడీజీ సీహెచ్.వెంకటేశ్వర్రావు అన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ‘స్పైసెస్’ పథకం కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఎంఆర్‌ఈసీ హబ్‌లు ఉమ్మడిగా శుక్రవారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఎర్త్ డేను నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీడీజీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కన్నతల్లి ప్రేమకు భూమాత ఏమాత్రం తీసిపోదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులను సంరక్షించుకోవాలన్నారు. ‘ఇన్వెస్ట్ ఆన్ ప్లానెట్’ అనే నినాదంతో ఈ సారి ఎర్త్‌డే వేడుకలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వ్యర్థాల నుంచి ఉపయుక్తాల తయారీ అనే పోటీ నిర్వహించగా 65 మంది 14 జట్లుగా ఏర్పడి, పలు పరిష్కారాలను ఇచ్చారు. వాటిలో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేసి, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఠి మహిళా కళాశాల వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్ సుష్మ, యాస్మీన్, కళాశాల డీన్ వెంకట్రామయ్య, అధ్యాపకుడు డాక్టర్ ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
భూమాతను కాపాడుకోవాలి:ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
జీవకోటి మనుగడకు మూలమైన భూగోళాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంయుక్తంగా శుక్రవారం ‘పుడమిని పునరుద్ధరించుకునేందుకు శక్తియుక్తులు వెచ్చిద్దాం’ అన్న అంశంపై నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలుష్యం నుంచి భూమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్ఛమైన, అందమైన భూగోళాన్ని భావి తరాలకు అందివ్వాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిది అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంలోని మార్పులు, కాలుష్యంపై చర్చించాలన్నారు. వెంకటేశ్వర ఆర్కిటెక్చర్ కళాశాలలో ఎర్త్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ఆర్కిటెక్చర్ వీవీఎల్ నరసింహన్, ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయి భాస్కర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ కే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కలుషితం కాకుండా చూసుకోవాలి..
పుడమి తల్లి కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని ఈఎస్ఐసీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్రావు అన్నారు. శుక్రవారం ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని ఈఎస్ఐసీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల కోసం పరిసరాలను కాపాడాలన్నారు.