రంగారెడ్డి, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్/ఆర్కే పురం: తెలంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాలు ఉన్నతంగా బతకాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని, ఆ కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దళిత బంధు పథకంలో భాగంగా శుక్రవా రం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్లో 50 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లను ఆ మె పంపిణీ చేశారు. మంత్రి సబిత మాట్లాడుతూ దళిత బంధు లాంటి పథకం వస్తదని జీవితంలో ఊహించి ఉం డరని, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించేది లేకుం డా దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రూ.10 ల క్షలను అందజేస్తున్నదన్నారు. పథకంలో భాగంగా ఇప్పు డు ఒక్కరికి అందే సాయంతో వారు రాబోయే రోజుల్లో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని చెప్పారు.
మరో వైపు వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడి ఏదైనా అనుకోనిది జరిగితే ఆదుకునేందుకు గాను ప్రత్యేకంగా రక్షణ నిధిని ఏర్పాటు చేశారని, జిల్లాలో రూ.8 కో ట్ల మేర రక్షణ నిధిలో జమ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అదే విధంగా దశల వారీగా నియోజకవర్గానికి 2వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అం దజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభు త్వం మహిళాభ్యున్నతికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఎక్కడాలేని విధంగా రాష్ట్ర వ్యాప్తం గా 53 గురుకులాలను బాలికల కోసం ఏర్పాటు చేశారన్నారు. రెండు పీజీ, రెం డు లా కాలేజీల ఏర్పాటుతో బిజినెస్ స్కూళ్లలో చదువుకునే అమ్మాయిలకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని మంత్రి అన్నారు.
దళితబంధుతో సొంత ట్రాక్టర్ వచ్చింది…
నాకు ఇద్దరు కూతుర్లు. నేను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేటోన్ని. పని ఉన్నప్పుడు మాత్రమే నడిపిస్తుంటి పైసలు ఇస్తుండ్రి. సరైన బతుకుదెరువు లేకపోవడంతో చాలా కష్టాలు పడినం. రూ.10 లక్షల విలువ చేసే ట్రాక్టర్ అందజేసిన సీఎం సారుకు ధన్యవాదాలు. మాలాంటి పేద దళిత కుటుంబాల్లో ఈ పథకంతో వెలుగులు నిండినయి. ప్రభుత్వం అందించిన సాయంతో నేను మరొకరికి ఉపాధిని కల్పిస్తాను. – వల్లెపాగ నర్సింహ
దళితులకు సువర్ణావకాశం..
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ఈ పథకం దళితులకు సువర్ణ అవకాశం. లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు వారు ఎంచుకున్న వ్యాపారాలపై అవగాహన కూడా కల్పించారు. దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారులు విస్తృతంగా ప్రచారం చేయాలి. లబ్ధిదారుల వ్యాపారాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారులు అవగాహన కల్పించాలి.
– సుధీర్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్
దళితబంధు సాహాసోపేతమైన నిర్ణయం
దళిత బంధు పథకం సాహాసోపేతమైన నిర్ణయం. గతంలో బ్యాంకు ల నుంచి రూ.50-60 వేల రుణాలిప్పించి ప్రచారం చేసుకునేవారు, కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి జమానత్ లేకుండా రూ.10 లక్షలను అందజేయడం అద్భుత అవకాశం. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు బాగుపడటంతో పాటు మరొకరికి ఉపాధి కల్పించే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే దళిత బంధు లాంటి పథకం ఎక్కడా లేదు.
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే;
మోసగాళ్లకు దళితులు తగిన బుద్ధి చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై విమర్శలు చేసే బీజేపీ లాంటి మోసగాళ్లకు దళితులు తగిన బుద్ధి చెప్పాలి. దళితులు అన్నింటిలోనూ వెనుకబడి ఉండటంతో పాటు ఇంకా వ్యవసాయ కూలీలుగానే బతుకుతున్నారని గుర్తించి సీఎం కేసీఆర్ ఈ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారు. దళిత కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనతో పాటు సమాజంలో తలెత్తుకుని బతకాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు.
– జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే, కల్వకుర్తి నియోజకవర్గం