సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నగరాన్ని సుందరవనం చేసి పౌరులకు ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించడం జీహెచ్ఎంసీ చేపడుతున్న నిరంతర ప్రక్రియ. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నది. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున పార్కుల అభివృద్ధిని చేస్తున్నది. ఈ క్రమంలోనే కాలనీల్లో పార్కుల అభివృద్ధి, రోడ్డుకు ఇరువైపులా, చెరువులు, కుంటల చుట్టు పక్కల అనేక చోట్ల పచ్చదనాన్ని నింపుతున్నది. ఈ క్రమంలోనే ఆరోగ్యమే పరమావధిగా వైవిధ్యమైన థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నది. రూ.123 కోట్లతో 12,89,337 చదరపు గజాల్లో వినూత్న అంశాలతో 57 థీమ్ పార్క్‌లకు శ్రీకారం చుట్టి విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటికే ఖైరతాబాద్, చార్మినార్, శేరి లింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ పరిధిలో 19 థీమ్ పార్కులను ప్రారంభించారు. వ చ్చే నెల మొదటి వారం 12 థీమ్ పార్కులు అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ బయోడైవర్శిటీ అధికారులు తెలిపారు. అన్ని చోట్ల సివిల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈ ఏడా ది చివరికల్లా థీమ్ పార్కులన్నీ ప్రారంభించి నగరవాసులకు ఊపిరినిచ్చే వేదికలుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు.