మేడ్చల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 26 నుంచి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. జిల్లాలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. మద్దతు ధరను రూ.1,960 ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
జిల్లాలో 7,884 ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు..
జిల్లా వ్యాప్తంగా 7,884 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుచేశారు. 18 వేలకు పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తున్నదని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఘట్కేసర్ మండలంలో మాదారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం, మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్, కేశవరం, ఉద్దమర్రి, కీసర మండలంలో కీసర, మేడ్చల్ మండలంలో మేడ్చల్, డబీల్పూర్, పూడూర్, శామీర్పేట్ మండలంలో శామీర్పేట్లో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను ఈనెల 26న మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం:మంత్రి మల్లారెడ్డి
యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోని 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఈనెల 26 నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.