– అల్లాపూర్,ఏప్రిల్15: అల్లాపూర్లోనీ బస్తీలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శ కాలనీలుగా మారుతున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న అల్లాపూర్.. గతంలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన కాలనీలు.. నేడు సకల వసతులతో సుందరంగా దర్శనమిస్తున్నాయి. గడిచిన ఏడేండ్ల కాలంలో డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కార్పొరేటర్ సబిహాబేగం సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లడంతో కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు.
డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శకాలనీలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు చేస్తున్నారు. పర్వత్‌నగర్ లో రూ.62 లక్షల మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణం, జనప్రియానగర్లో రూ.16 లక్షలతో కమ్యూనిటీహాల్, గాయత్రీనగర్‌లో రూ.86 లక్షల వ్యయంతో ఇండోర్ స్టేడియం, ఆర్సొసైటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణ దశలో ఉంది. ఇలా ప్రతి కాలనీలో కమ్యూనిటీహాళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.
రూ. 24కోట్లతో రహదారుల నిర్మాణం ..
డివిజన్లోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టి, పూర్తి చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో సుమారు రూ.24కోట్లతో సీసీరోడ్డు పనులు చేపట్టి పూర్తిచేశారు. అదేవిధంగా వివేకానందనగర్, శివాజీనగర్, పర్వత్‌నగర్, గాయత్రీనగర్, తదితర కాలనీల్లో డ్రేనేజీ, తాగునీటి పనులు పూర్తిచేసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డివిజన్ రూపురేఖలు మార్చారు
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి నోచుకున్నది. డ్రైనేజీ, సీసీరోడ్లు వేశారు. గత ప్రభుత్వాల హయాంలో సమ్యలను పట్టించుకున్న పాపానపోలేదు. ఏడేండ్లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబిహాబేగం ప్రత్యేక చొరవ చూపి రాజీవ్ గాంధీనగర్, సఫ్థార్నగర్లో ముంపు సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి అల్లాపూర్ డివిజన్ రూపురేఖలు మార్చేశారు.
– మాధవ చారి, రాణాప్రతాప్‌నగర్