బంజారాహిల్స్/హియాయత్‌నగర్,ఏప్రిల్ 15: ఏసుక్రీస్తు లోకరక్షణ కోసం శిలువ ఎక్కిన రోజును గుర్తుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచంలోని పాపాలన్నీ తాను మోస్తానంటూ కల్వరి పట్టణంలో శిలువను ఎక్కడంతో పాటు ప్రాణత్యాగం చేసిన ఏసుక్రీస్తు ఈస్టర్ రోజున పునరుజ్జీవం పొందాడని క్రైస్తవుల విశ్వాసం. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని షరోన్ చర్చిలో పాస్టర్ ఎం.ప్రభుదాస్ గుడ్‌ఫ్రైడే ప్రాముఖ్యత, క్రీస్తు త్యాగాలను వివరించగా, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 8లోని సెయింట్ ఆల్ఫోన్సస్ చర్చిలో క్రీస్తు శిలువను ఎక్కిన దృశ్యాలతో రూపకం భక్తులను కన్నీళ్లు పెట్టించింది.
ఘనంగా గుడ్‌ప్రైడే వేడుకలు
గుడ్ ప్రైడే సందర్భంగా నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి.ఈ సందర్భంగా శామ్యూల్ ప్రసంగిస్తూ దేవుని యందు నమ్మకంతో ముందుకు సాగితే నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ విజయ ప్రాప్తి కలుగుతుందని, పాపం నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం దేవుడిని ప్రార్థ్ధ్ధించాలన్నారు.