ఆర్కేపురం/ఎల్బీనగర్, ఏప్రిల్ 15: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బంధు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు శుక్రవారం సరూర్‌నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ పాఠశాల మైదానంలో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు దయానంద్‌గుప్త, ఎగ్గే మల్లేశం, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర గ్రాంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి 8 నియోజకవర్గాలకు సంబంధించి 347 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.
మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంమని, దమ్ముంటే బీజేపీ నాయకులు మీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేయించాలని డిమాండ్ చేశారు. అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలబడ్డారన్నారు. నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు ఈ ఆర్ధిక సంవత్సరంలో అందిస్తామని చెప్పారు. రూ.17800 కోట్లతో ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది దళితులకు దళితబంధు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.విద్యా ద్వారానే మార్పు సాధ్యమని మహనీయులు అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మధ్యలోనే చదువు ఆపేయకుండా ఎస్సీ అమ్మాయిల కోసం 53 మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివేశాల్లో చదవాలనే కోరికను తీర్చటానికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20లక్షలను ప్రభుత్వం అందిస్తుందని, ఇప్పటికే 5వేల మందికి సహాయం అందించిందని చెప్పారు. దళిత బంధు తీసుకున్న వారు రెండళ్ల తర్వాత అద్భుతాలు సృష్టిస్తారని సీఎం కేసీఆర్ పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలిపారు.
‘దళితబంధు’ దేశానికే ఆదర్శం
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన దళిత బంధు లబ్ధిదారులను యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సరూర్‌నగర్‌లో ప్రారంభించారు. శంషాబాద్ మండలంలోని కేబిదొడ్డి గ్రామానికి చెందిన బైండ్ల చంద్రశేఖర మల్కారం గ్రామానికి చెందిన నీరటి రాజులకు యూనిట్లను పంపిణీ చేశారు.