ఆర్కేపురం, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమాన గౌరవం ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్‌నగర్ డివిజన్లోని భగత్‌సింగ్‌నగర్‌లోని మసీదులో బట్టల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పండుగ సందర్భంగా ముస్లింసోదర, సోదరీమణులకు రంజాన్ తోఫాగా బట్టల పంపిణీతోపాటు ఇఫ్తార్ విందులు ఇస్తున్నట్లు తెలిపారు. కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అధికారులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా..
టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నిడమర్తి నవీన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొంది ఉన్న నవీన్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ నుంచి వచ్చిన రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, నాయకులు అరవింద్‌శర్మ, సాజిద్, గొడుగు శ్రీనివాస్, శంకర్‌నాయక్, ఊర్మిలారెడ్డి, అనురాధ, జగన్ ఉన్నారు.