మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 15 : మురుగు నీరు ఇంటి ముందు నిల్వ ఉండటంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దుర్గంధంతో ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటికి ఆనుకొని మురుగు కుంట ఉంటే ఎలా భరించగలమని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్ కాలనీలో మురుగు నీరు తమ ఇంటి ముందు వచ్చి చేరి కుంటగా మారింది. పక్కనే ఎర్రకుంట చెరువు అందులో శ్మశాన వాటిక ఉన్నది. సాయత్రం అయితే అక్కడి నుంచి వచ్చే దుర్వాసనతో వస్తున్నది. దుర్గంధం వెదజల్లుతూ దోమల బెడద తీవ్రంగా ఉండటంతో ఆ ఇంట్లో ఉండేవారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేశారు. డ్రైనేజీ పైపులైన్ వేసి ఉంటే ఇంటి ముందు మురుగు నీరు ఆగేది కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇంటి ముందు మురుగు నీరు నిల్చుని ఉంటుందని, అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు డ్రైనేజీ నీరు ముందుకు వెళ్లే విధంగా సొంత డబ్బులతో జేసీబీ సాయంతో క్లీనింగ్ చేస్తున్నారు. అయినా కొన్ని రోజులకే మురుగు నీరు మరలా చేరుతుంది. డ్రైనేజీ పనులు జలమండలి అధికారులు ఆధీనంలోకి రావడంతో ఎవరికి మురుగు సమస్య తెలుపాలో అర్ధం కావడంలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా నివారించాలని అధికారులను కోరుతున్నారు.
మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
పద్మశాలిపురం నుంచి వచ్చే మురుగు నీరంతా ఇక్కడికే చేరుతుంది. పైపులైన్ వేసి ఎర్రకుంటలో కలిపితే ఈ సమస్య లేకుండా అవుతుంది. డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తా. మాదృష్టికి ఇప్పటి వరకు తీసుకురాలేదు. తప్పనిసరిగా జలమండలి జీఎంకు సమస్యను వివరించి మురుగు లేకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా. – అబ్దుల్ సత్తార్, మైలార్దేవ్పల్లి డివిజన్
జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్