సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఇక నుంచి డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రెండు డ్రోన్ కెమెరాలతో బందోబస్తు నిర్వహణ విజయవంతంగా జరుగడంతో ఇక నుంచి సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధికి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)కు అనుసంధానం చేస్తూ మతపరమైన ర్యాలీలు, రాజకీయ సభలు, సమావేశాలు, ఇతర ప్రధాన వేడుకల సందర్భంగా డ్రోన్లను ఉపయోగించనున్నారు. త్వరలోనే సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఒక్కో డ్రోన్ కెమెరాను అందుబాటులోకి తేనున్నారు. ట్రాఫిక్ విభాగంలోనూ డ్రోన్ కెమెరాలను వాడనున్నారు. రెండు నెలల కిందట తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ట్రయల్ రన్ నిర్వహించారు.