సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : క్రికెట్ బెట్టింగ్ బుకీలు పోలీసులకు చిక్కకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎనీడెస్క్ యాప్‌ను ఉపయోగించి కోట్ల దందా సాగిస్తున్నారు. పోలీసులకు చిక్కినా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. కేసు నమోదైనా విచారణలో కేసు నిలువకుండా ఉండేందుకు సాంకేతికతను జోడించి జోరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పట్టుకున్న బెట్టింగ్ ముఠాల ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడో పక్కరాష్ట్రంలో మారుమూల గ్రామంలో గుడిసెలో ఉంటూ దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని కోట్ల దందా సాగిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఏపీలోని మారుమూల గ్రామాల్లో..
బుకీలు ఇతర రాష్ర్టాల నుంచి బెట్టింగ్‌ల కోసం లైన్‌ను తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ లైన్‌కు సంబంధించిన కమ్యూనికేషన్ బోర్డును రూపొందిస్తారు. ఆ కమ్యూనికేషన్ బోర్డు ద్వారా పంటర్లకు యూజర్, పాసువార్డులను ఇచ్చి వారికి నేరుగా బెట్టింగ్ రేటింగ్‌లతో పాటు ప్రత్యక్ష మ్యాచ్ స్కోర్ బోర్డు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు సోదాలు జరిపినప్పుడు అధారాలు ఒకే చోట దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. గుడిసెలు, చిన్న చిన్న గదులను అద్దెకు తీసుకుని కమ్యూనికేషన్ సెటప్‌ను ఏర్పాటు చేసి నమ్మకమైన వారిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నారు. ఆ తర్వాత బుకీలు హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, బంధువుల ఇండ్లలోని ఓ గదిని తీసుకుని ఓ ల్యాప్‌టాప్‌తో బెట్టింగ్ దందాను వీక్షిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న మరుక్షణమే బుకీల అనుచరులు కమ్యూనికేషన్ బోర్డును మాయం చేసేస్తారు. ఇటీవల రాచకొండ పోలీసులు వనస్థలిపురంలో ఓ ముఠాను పట్టుకోగా ఇదే ప్రక్రియ వెలుగులోకి వచ్చింది.
వనస్థలిపురంలో ఉన్న ప్రధాన బుకీ ఓ ల్యాప్‌టాప్‌తో బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. అతని అనుచరులు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కమ్యూనికేషన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ ముఠా నుంచి దాదాపు రూ.1.20 కోట్ల విలువ చేసే నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నివారణలో భాగంగా ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 7న మ్యాచ్ జరుగుతుండగా ఏడు ప్రాంతాల్లో ఒకే సారి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సోదాలు జరిపారు. గచ్చిబౌలి-2, మాదాపూర్-1, మియాపూర్-2, బాచుపల్లి-1, కూకట్పల్లి-1 ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.50 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.