ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు మద్దతుగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా హస్తినకు తరలివెళ్లారు. అక్కడ అన్నదాతకు మద్దతుగా తమ నిరసన గళాన్ని వినిపించారు. మోదీ సర్కారు దిగివచ్చి ధాన్యం మొత్తం కొని తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు.. తమకు మద్దతుగా కేసీఆర్ దీక్ష చేయడం పట్ల మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ముందుండి పోరాటం సాగిస్తామని తేల్చిచెప్పారు. ఈ నిరసన దీక్షలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ, సబితాఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు కే.కేశవరావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, సాయన్న, బేతి సుభాష్‌రెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, వాణీదేవి, దయానంద్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
వడ్లన్నీ కొనుగోలు చేయాల్సిందే
తెలంగాణలో పండించిన వడ్లన్నీ కొనుగోలు చేయాల్సిందే. కష్టపడి పండించిన పంటను కొనకపోతే రైతులు నష్టపోతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమనడం అన్యాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే.. బీజేపీ మాత్రం నాశనం చేయాలని చూస్తోంది. కేసీఆర్ ఉద్యమానికి రైతుల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఢిల్లీ ఉద్యమంతో కేంద్రం దిగివస్తుందన్న నమ్మకం ఏర్పడింది.
– బాల్‌రెడ్డి, రైతు, మేడ్చల్
సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో వరికంకులు పిడికిలెత్తాయి. తెలంగాణలో పండించిన పసిడిపంటపై కేంద్రానికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించాయి. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం ధోకాను దేశమంతా వినిపించేలా రైతుల పక్షాన గొంతెత్తాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన రైతు దీక్షతో దేశ రాజధాని దద్దరిల్లింది. అన్నదాతలను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ… టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతనిధులు రైతుల పక్షాన ఢిల్లీలో కదం తొక్కారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణపై వివక్ష చూపిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మోదీ సర్కారు మెడలువంచైనా ధాన్యం సేకరణపై దిగివచ్చేలా చేస్తామని చెప్పారు.
ఉద్యమం ఆగదు..
ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష దేశం మొత్తం తెలువాలి. వడ్లు కొనే వరకు ఉద్యమం ఆగదు.
– ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
ఉద్యమ సెగ మొదలైంది..
ఢిల్లీ నుంచి గల్లీ వరకు రైతు ఉద్యమ సెగలు మొదలయ్యాయి. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ విశ్రమించదు.
– రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
రైతుల ఉసురుతగుల్తది
మోదీ ప్రభుత్వం రైతులకు ప్రాణసంకటంగా మారింది. కేంద్రం వడ్లను కొనకుండా ఢిల్లీలో దీక్ష చేయాల్సిన అనివార్య పరిస్థితులను కల్పించింది. ధాన్యం సేకరణపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఉలుకూ పలుకు లేదు. రకరకాల షరతులు పెడుతున్న కేంద్రానికి రైతుల ఉసురుతగుల్తది.
– కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న
కేంద్రానికి పుట్టగతులుండవు..
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆగం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్నంతా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే.
– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కొనేవరకు కొట్లాడుతాం..
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తాం. కేంద్రం ఇప్పటికైనా తన నిరంకుశ వైఖరిని మానుకోవాలి. రైతులు ఆగ్రహిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిపోవటం ఖాయం.
– ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
వివక్షను వ్యతిరేకిస్తున్నాం..
రైతులు పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం.
– ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు