చర్లపల్లి, ఏప్రిల్ 11: ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈసీఐఎల్ ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించామని ఈసీఐఎల్ చైర్మన్, ఎండీ రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే రిటైడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో వెల్ఫర్ ఫండ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 55వ క్రీడా సాంస్కృతిక ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదున్నర దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామిగా నిలిచామని, సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో ఘనత సాధించామన్నారు. దేశ రక్షణ రంగానికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఈసీఐఎల్ పరిశ్రమకు తగిన గుర్తింపు తీసుకువచ్చామని అన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అంతకు ముందు ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు ఏఎస్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ డైరక్టర్ పర్సనల్ సమీర్ ముఖర్జీ, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ భాస్కర్‌రెడ్డి, జీవీఆర్వీ. ప్రసాద్, ఎస్డబ్యూయూ కార్యదర్శి కరుణానిధి, వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి దేవ కృష్ణలతో పాటు వివిధ విభాగాల అధికారులు, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.