సికింద్రాబాద్, ఏప్రిల్ 11 : ఢిల్లీ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సభ్యుల బృందం సోమవారం ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ (డీజీ) మీనా బి. శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. రూ. 700కోట్ల సర్వీసు చార్జీలను విడుదల చేయాలని, తిరుమలగిరిలోని మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాలు నుంచి వెంటనే డంపింగ్ యార్డును తరలించాలని, సివిల్ ప్రాంతాల్లో ఉంటున్న సివిలియన్లకు యాజమాన్య హక్కును కల్పించాలని, బీ3, బీ4 స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేలా అనుమతులివ్వాలని, రహదారుల విస్తరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేతలు ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈమేరకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ వినతి పత్రంలో పేర్కొన్న అంశాలపై డైరెక్టర్ జనరల్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. అదనపు డీజీని కలిసిన వారిలో బోర్డు మాజీ సభ్యులు బి.ప్రభాకర్, పాండుయాదవ్, పి. శ్యాంకుమార్, లోకనాథం తదితరులు ఉన్నారు.