సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): డ్రగ్ స్మగ్లర్లు కొత్తదారులు వెతుక్కున్నారు. వాటర్ బాటిళ్లను అడ్డుపెట్టి మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. బాటిల్లో ఓ మూత.. ఆ మూతలో డ్రగ్ ఉంచి ఎవరికీ తెలియకుండా పబ్బులో పంచుతున్నారు. బంజారాహిల్స్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు ఇలాంటి కొన్ని దృశ్యాలను గుర్తించారు. రాడిసన్ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లోని సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్న పోలీసులకు.. కొందరు బాటిళ్లను పట్టుకొని తిరుగుతున్నట్టు కనిపించారు. అలాంటి అనుమానాస్పద దృశ్యాలపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. గతంలో బాటిళ్లలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటనలు ముంబై, ఢిల్లీలో వెలుగు చూశాయి. అదేతరహా హైదరాబాద్‌లోనూ కొందరు డ్రగ్ స్మగ్లర్లు ఈ దందాను కొనసాగిస్తున్నారా.? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా డ్రగ్ రవాణా మార్గాలు.. వాటిని అరికట్టే విధానాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆన్లైన్ యాప్‌లలో వాహనాలు బుక్ చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు బాటిళ్ల చాటున డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఈ బాటిళ్ల వ్యవహారంపై దృష్టిపెట్టారు. గతంలో వెలుగు చూసిన కేసుల ఆధారంగా బాటిళ్లను పరిశీలిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన మందులను దాచుకునే వీలున్న వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా స్మగ్లర్లు వదలకుండా హెల్త్ మెడిసిన్‌కు బదులుగా మత్తు పదార్థాలను వాటిలో దాచిపెడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాటిళ్లలో స్మగ్లింగ్ ఇలా..
కొన్ని వాటర్ బాటిల్స్ పైన మూత పెద్దదిగా ఉంటుంది. పెద్దదిగా ఉన్న మూత (క్యాప్)లోనే డ్రగ్స్ స్టోర్ చేసుకునే ఏర్పాటు చేస్తారు. బాటిల్ పైన ఉండే మూత (క్యాప్) తెరిచి అందులో ఉన్న నీళ్లు తాగుతుంటారు. అయితే, ఎవరికీ ఆ బాటిల్ మూతలో రెండు భాగాలున్నాయన్న విషయం అర్థం కాదు. స్మగ్లర్లు అలాంటి బాటిల్స్‌ను ఎంచుకొని వెంట తెచ్చుకుంటారు. పబ్‌లలో చీకటిగా ఉన్న ప్రాంతాలను ఎంచుకునే స్మగ్లర్లు ఆ బాటిల్ నుంచి డ్రగ్స్ తీసి వినియోగదారులకు ఇస్తారు. పబ్‌లోకి సాధారణ కస్టమర్లలా విక్రేతలు వచ్చి పోతుంటారు. డ్రగ్ ప్యాకెట్లు బాటిళ్లలో తీసుకువచ్చి పబ్‌లలో ఉండే మేనేజర్లు, ఆయా నిర్వాహకులతో జతకట్టి విక్రేతలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. ఇందులో పబ్‌లలో పనిచేసే వ్యాపారులు, డీజేలతో పాటు నిర్వాహకులు కూడా పాత్రధారులుగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారంలో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరిస్తూ దానిని అరికట్టేందుకు కావాల్సిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. అలాగే, పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకుడు ఉప్పల అభిషేక్, మేనేజర్ అనిల్‌కుమార్‌ను కూడా డ్రగ్స్‌కు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ప్రశ్నించి, వివరాలు సేకరించనున్నారు. డ్రగ్స్ దందాలో రోజు రోజుకూ వస్తున్న కొత్త విధానాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూర్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసుల్లో నేరస్థులు ఎంచుకుంటున్న మార్గాలను విశ్లేషిస్తున్నారు. వాటి ద్వారా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాను పూర్తిస్థాయిలో అణిచివేసేందుకు దర్యాప్తు బృందాలు కసరత్తు చేస్తున్నాయి.